*11.11.2020*
*అమరావతి*
*భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం:*
*భారీ వర్షాలు, వరదలతో రూ.8084 కోట్లు నష్టం*
*మానవతా దృక్పథంతో చూడండి*
*వీలైనంత సహకారం అందేలా చేయండి*
*దెబ్బతిన్న ధాన్యం, వేరుశనగ కూడా కొనుగోలు చేయాలి*
*ఆ మేరకు ’కనీస నాణ్యతా ప్రమాణాలు’ సడలించాలి*
*లేకపోతే రాష్ట్రంలో రైతులు నష్టపోతారు*
*కేంద్ర బృందంతో సీఎం శ్రీ వైయస్ జగన్*
*అమరావతి:*
రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం శ్రీ వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది.
అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది.
రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్‌రాయ్ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని ఆయన తెలిపారు. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని చెప్పారు.
*కేంద్ర బృందంతో భేటీ సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..*
రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాని, హోం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మా విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
అనంతపురం జిల్లాలో జరిగిన వేరుశనగ పంట నష్టం కూడా చూశారు.
*భారీగా నష్టం:*
భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగింది.
మొత్తం రూ.8084 కోట్ల నష్టం జరిగింది.
అందులో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగింది.
వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ.3 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది.
*వీలైనంత సహకరించండి:*
భారీ నష్టం జరిగినందువల్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి.
వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా సహకరించండి.
రైతులను ఆదుకోవడంలో సహాయపడండి.
*’ఎఫ్ఏక్యూ’ రిలాక్సేషన్ ఇవ్వండి:*
వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేయాలి.
ఆ మేరకు ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ’కనీస నాణ్యతా ప్రమాణాలు’ (ఎఫ్ఏక్యూ) సడలించాలి.
లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
*ఇన్పుట్ సబ్సిడీ:*
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇస్తున్నాం.
ఈ ఏడాది ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చాము.
అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయి.
ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలి.
కాగా, గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని వివరించారు.
మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శి ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.