ఢిల్లీలోని తూర్పు కైలాష్‌లో నివాసముంటున్న ప్రాపర్టీ వ్యాపారి ఉత్కర్ష్ జైన్‌కు చెందిన క్రెటా కారు మంగళవారం అర్థరాత్రి చోరీకి గురి కాగా బుధవారం ఉదయమే ఆ విషయం పసిగట్టిన కైలాష్ కారులో అమర్చిన జీపీఎస్ సహాయంతో మీరట్‌లోని జాకీర్ కాలనీలోని లిసాడి గేట్ వద్ద ఆ కారు ఉన్నట్లు గుర్తించి వెంటనే మీరట్ లో ఉంటున్న తన బందువు సుధాంషు మహారాజ్ కు సమాచారం అందించారు. సుధాంశు మహారాజ్ ఈ విషయాన్ని ఉదయం ఆరు గంటలకు స్థానిక పోలిసులకు తెలుపడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా కారు కోసం అన్వేషణ ప్రారంభించగా కారు లొకేషన్ మారి పల్లవపురంలోని అన్సాల్ కాలనీలో కారు ఉన్నట్లు చూపించడం మొదలైంది. దీంతో పల్లవపురం ఎస్ఐ అవ్నీష్ కుమార్ అష్త్వాల్ కు సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

కారులో అమర్చిన భద్రతా వ్యవస్థ సహాయంతో ఉత్కర్ష్ ఢిల్లీలో కూర్చొని కారును లాక్ చేయగా కారు ఇంజిన్ పనిచేయడం మానేయడంతో దొంగలు స్టార్ట్ చేయడంలో విఫలమయ్యారు. ఇంతలో పల్లవపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు ఎక్కడుందో ఆరా తీసి కారు స్వాధీనం చేసుకోగానే దొంగలు పరారయ్యారు. ఈ సౌలభ్యం బాగుంది కదూ..