మెట్రోరైలు ప్యాసింజర్లను వారికి నచ్చినచోటుకు త్వరగా చేర్చడానికి బైక్ టాక్సీ సర్వీస్ ప్లాట్ ఫామ్ ర్యాపిడో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తో చేతులు కలిపింది. హైదరాబాద్​లో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా రెండు సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. ఇక నుంచి అన్ని మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద బైక్ టాక్సీలను ర్యాపిడో అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల మెట్రో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో నచ్చినచోటుకు త్వరగా చేరుకోవచ్చని ర్యాపిడో కో-ఫౌండర్​ శంక అరవింద్ అన్నారు.

”రవాణా సదుపాయాలు తక్కువగా ఉండే ప్రాంతాలకు మెట్రో స్టేషన్ల నుంచి త్వరగా వెళ్లలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల బైక్​ట్యాక్సీ జోన్లను ఏర్పాటు చేసి స్టేషన్ నుంచి ప్యాసింజర్​ బయటికి వెళ్లగానే బైక్​ట్యాక్సీ రెడీగా ఉంటుంది” అని అన్నారు.

ఈ సందర్భంగా ఎల్ అండ్ టి ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ”హైదరాబాద్ మెట్రో రైలు ప్రతి రోజూ దాదాపు 2.40 లక్షల మందికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రయాణికుల సంఖ్య కోవిడ్ కు ముందులాగానే ఉంటుంది. మెట్రో స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేలా ర్యాపిడోతో చేతులు కలిపినందుకు సంతోషంగా ఉంది’అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.