ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరపగా శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలను వెల్లడిస్తూ ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు.

వీటిని స్ట్రోమాటోలైట్స్‌ అంటారని, స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.