ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నాయ‌కులు అక్ర‌మాల‌కు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ్డార‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ‌ల ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను ఉప‌యోగించుకునేందుకు, స్వేచ్ఛ‌గా ఓటు వేసేందుకు కూడా అధికార పార్టీ ఆటంకాలు క‌ల్పించింద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు చేస్తున్న ఆక్ర‌మాల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, క‌లెక్ట‌ర్ల‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో వైసీపీ చేస్తున్న దౌర్జ‌న్యాల‌ను, అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌డంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ విఫ‌ల‌మైంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఉన్న అధికారాల‌ను సైతం వినియోగించుకోలేక‌పోయింద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, శాంతియుతంగా జ‌రిగేందుకు కేంద్రం స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు కోరారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర బ‌ల‌గాల‌ను పంపించాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ అధికారులను నియ‌మించాల‌ని ఆయ‌న కోరారు. స్వ‌యంగా మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు ఏకంగా ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను, అధికారుల‌ను బెదిరిస్తున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవాలని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు.