ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ మంత్రుల ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి మధ్య పేచీ మొదలైంది. ఇవాళ ఉదయం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్పైన కూడా కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని, ఇంటింటికీ రేషన్ సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు నాయుడును ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్ లక్ష్యంగా చేసుకొని కొడాలి నాని చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.
మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ రమేష్ కమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠ దిగజారేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని, వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ బహిరంగ ప్రకటన చేయాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోగా మంత్రి స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా తమ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.