వార్తలు (News)

ది గ్రేట్ ఇండియన్ కిచెన్-మలయాళీ చిత్ర విశ్లేషణ


ఓటీటీలో విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనాత్మక విజయం సాధించింది. దేశం నలుమూలల నుంచీ ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా మలయాళంలో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమా.దీని కథ పురుషాధిక్య సమాజంలో రోజువారీగా ఇళ్లల్లో జరిగే ప్రహసనాన్ని, స్త్రీలను ఇంటి పనులకే పరిమితం చేసే వివక్షను సూక్ష్మ దృష్టితో వెలుగులోకి తీసుకువస్తుంది..ఇదే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా కథ.
మన ఇళ్లల్లో, మన కళ్ల ముందే జరుగుతున్న వివక్షను మనం ఎంత సాధారణంగా తీసుకుంటున్నాం అనే అంశాన్ని ఎత్తి చూపిస్తూ మనల్ని మనం ప్రశ్నించుకునే ఆవశ్యకత ఎంత ఉందొ వివరించే ఘటనలు ఈ చిత్రం లో చాల ఉన్నాయి.మధ్య తరగతి కుటుంబాల్లో, “గౌరవమైన” కుటుంబం అని చెప్పుకునే ఇళ్లల్లో స్త్రీలు కూడా వంటింటి కుందేళ్లుగా ఎలా మారిపోతున్నారు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమాపై కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి.
“ఇతి సార్వజనీనమైన కథ. భారతదేశంలోని ప్రతీ ఇంట్లో జరిగే కథ. వంటింట్లో స్త్రీల పాట్లు దేశమంతటా ఒకలాగే ఉన్నాయి. మగవాళ్లు, ఆడవాళ్లను వంట చేసి, బట్టలు ఉతికి, పిల్లలని కని పెంచే యంత్రాల్లాగ చూస్తారు” అని ఈ సినిమా దర్శకుడు జో బేబీ అంటున్నారు.

ఈ సినిమాకు ప్రేరణ తన సొంతింట్లో.. తన వంట గదిలోంచే వచ్చిందని ఆయన చెప్పారు.”స్త్రీ, పురుషుల సమానత్వాన్ని నేను విశ్వసిస్తాను.నాకు 2015 వివాహమైన తరువాత వంట గదిలో గడపడం అలవాటు అయింది.అప్పుడే వంట చేయడం అంటే కేవలం గరిట తిప్పడం మాత్రమే కాదని దానికోసం ఇంకా చాల కష్టతరమైన పనులు కూడా చేయవలసి వస్తుందని, బరువులు ఎత్తవలసి వస్తుందని అర్ధమైంది.

కొంతకాలం గడిచిన తర్వాత ఈ శ్రమను ఎలా తగ్గించుకోవాలో తెలియక నేనే సతమతమవుతూ ఉండేవాడిని.చేసిన పని మళ్ళీ చేయడం చాలాకష్టం గా ఉండేది.నను నేనే జైలు గోడల మధ్య గడుపుతున్నానేమో అనే అనుమానం వచ్చేది.నాకే ఇలా ఉంటె ఆడవాళ్లకు ఎలాంటి భావాలూ కలుగుతాయో అనే ఆలోచన నన్ను చాలా కలవర పెట్టేది.
ఆ కలవరపాటు నన్ను ఈ చిత్రం తీయాలని ప్రేరేపించింది.
నిమిష సజయన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పెళ్లి ఘట్టంతో మొదలవుతుంది. చాలా వివాహాల్లాగే ఇది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. హీరో, హీరోయిన్లు ఇద్దరూ పెళ్లిచూపుల్లో కలుసుకుంటారు. పొడి పొడిగా మాట్లాడుకుంటారు. తరువాత వారిద్దరికీ వివాహం అవుతుంది.

వివాహ వేడుక ముగిసిన అతి కొద్దీ రోజులలోనే కొత్త జంట దిన చర్య మొదలవుతుంది. కొత్త పెళ్లికూతురు వంటింట్లో అత్తగారికి సాయపడుతూ ఉంటుంది. పొద్దున్నుంచీ రాత్రి వరకూ ఇద్దరూ వంటింట్లోనే మగ్గుతూ భర్తకు, మామగారికి వండి వడ్డిస్తుంటారు.

ఆ అమ్మాయికి పడకగదిలో కూడా జీవితం కష్టంగానే ఉంటుంది. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. భారతీయ సమాజంలో భార్య ఇష్టాయిష్టాలతో, కోరికలతో పని లేదని చాలామంది భర్తలు భావిస్తుంటారు. ఆ అమ్మాయి దైనందిన జీవితం ఇలా యాంత్రికంగా మారుతుంది.

“ఈ సినిమాను చూసినవారందరూ తమకి తాము రిలేట్ చేసుకోగలుగుతారు. సినిమాలో హింస లేదు, ఎవరినీ విలన్లుగా చూపించలేదు. చాలా వాస్తవికంగా.. ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించారు. ఇప్పటికి చాలా ఇళ్లల్లో జరిగే తంతే ఇది. ఈ వివక్షకు మనం అలవాటు పడిపోయాం. అది వివక్ష అని కూడా గ్రహించలేనంత మొద్దుబారిపోయాం” అని అనిపిస్తుంది.

కేరళ కుటుంబాల్లో మూడు పూట్ల వండే వంటలు చాలా శ్రమతో కూడుకున్నవని, తన తల్లితో సహా ఇళ్లల్లో ఇతర ఆడవాళ్లు వంటింట్లోనే మగ్గిపోవడం సాధారణంగా మనం చూసే అంశమే!

“తరగడం, కోరడం, రుబ్బడం, వండిన వాటిని అలంకరించడం.. చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సులువైన పద్ధతులున్నాయి. కానీ అలా చెయ్యం. ఎందుకంటే భర్తే దైవం అనీ, అతని కుటుంబమే సర్వస్వమని ఆడవాళ్లకు చిన్నప్పటినుంచీ నూరిపోస్తారు. వాళ్లని సంతోషపెట్టడమే తన బాధ్యత అని నమ్మిస్తారు. స్త్రీ శక్తి అని, భూదేవంత ఓర్పుగలదని చెప్పి మభ్యపెడతారు” అని ఆమె అన్నారు
భారతదేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా పేరు పొందింది. అంతే కాకుండా, పెద్ద సంఖ్యలో మహిళలు అధికారిక ఉద్యోగాల్లో ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, కేరళ కూడా దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగే పురుషాధిక్యత నిండి ఉన్న సమాజమని చాలామంది అభిప్రాయపడ్డారు.

“కేరళలో స్త్రీల సాధికారిత గురించి ఎక్కువగా మాట్లాడతాం. పెద్ద సంఖ్యలో మహిళలు ఇంటినుంచీ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఎన్ని చేసినా, ఏం మాట్లాడినా చివరికి ఇంటి బాధ్యత మొత్తం స్త్రీల నెత్తి మీదే పడుతుంది. బాగా చదువుకున్న, అభ్యుదవాద కుటుంబాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది” అని ఆమె అన్నారు .

“మగవాళ్లు సమానత్వం గురించి మాట్లాడతారు కానీ, ఎవరిళ్లల్లో వాళ్లు పాటించరు. చాలా ఆధునిక భావాలు ఉన్న వ్యక్తులు కూడా ఇంటి దగ్గర మాత్రం అవేవీ పాటించరు. ఇంటి బాధ్యత అంతా ఆడవారి మీదే వదిలేస్తారు.

కేరళలో ఒక నానుడి ఉంది. అభ్యుదయమనే చెప్పులు వేసుకోవచ్చు గానీ, వాటిని ఇంటి బయటే విడిచి రావాలని దానర్థం” . దానిని అందరు పాటిస్తున్నారు కూడా!

ప్రపంచంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే ఇండియాలో కూడా ఆడవాళ్లు చేసే పనికి విలువ ఉండదు. జీతం భత్యం లేని ఇంటి పని నిరంతరంగా చేస్తూనే ఉంటారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. 2018లో భారతదేశ నగరాల్లో మహిళలు రోజుకు 312 నిముషాలు జీతం లేని ఇంటి పని చేస్తున్నారు. మగవారు 29 నిముషాలు మాత్రమే చేస్తున్నారు.

ఈ అంశం ఆధారంగానే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా మార్పు తేవాలని ప్రయత్నించింది.

“పురుషులు తయారుచేసిన జైళ్లల్లో స్త్రీలు బతుకుతున్నారు. మగవారే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లు చెప్పిన పనల్లా చెయ్యడమే ఆడవారి పని. వారికి జీతాలుకానీ,ఎలాంటి విలువ కానీ ఉండవు. ఈ సినిమా ద్వారా నేను ఆడవాళ్లకు చెప్పదల్చుకున్నది ఒక్కటే.. ఈ ఉచ్చులోంచి బయటపడండి. ఎందుకు ఇందులోనే మగ్గిపోతున్నారు? ఈ ప్రపంచం మీది కూడా. దీన్ని ఆస్వాదించే హక్కు మీకూ ఉంది” ” అని జో బేబీ అన్నారు.
మార్పు అంత తొందరగా రాదు. కానీ ఈ సినిమా ఒక మంచి ప్రయత్నం. ఇళ్లల్లో నిత్యం చూసే స్త్రీ, పురుషు అసమానతల గురించి ఈ సినిమా ఒక చర్చ లేవనెత్తింది. ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఈ సినిమా గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఇళ్లల్లో ఉన్న అసమానల పట్ల గొంతెత్తుతున్నారు.

ఇది మన కథ అనీ, మనం మేలుకోవలసిన సమయం ఆసన్నమైందనీ వ్యాఖ్యానిస్తున్నారు. పురుషాధిక్యత కర్కశంగా, క్రూరంగా ఉండక్కర్లేదని…మెత్తగా మాట్లాడేవాళ్లు కూడా అధికారం చలాయిస్తారని, ఆడవాళ్ల నోరు నొక్కేస్తారని ఈ సినిమా చెబుతోంది అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

మరో వైపు, ఈ సినిమా తమకు కనువిప్పు కలిగించిందని, ఇన్నాళ్లు ఈ అసమానతలను గుర్తించనందుకు సిగ్గుగా ఉందని మగవాళ్లు కూడా అంటున్నారు.

ఇది మంచి పరిణామం అని, అందరూ దీని గురించి మాట్లాడుకోవడం అవసరం కూడా!
“ఇవాళో, రేపో మార్పు వచ్చేస్తుందని కాదు. ఇలాంటి చర్చల వలన కొన్ని దశాబ్దాలు కాకుండా కొన్ని సంవత్సరాలలోనే కొంచం తొందరగా మార్పు వచ్చే అవకాశం ఉంది.

చాలామంది అబ్బాయిలకు జెండర్ అసమానలత పట్ల అవగాహన ఉంది. కానీ, వారు తమ పురుషాధిక్యాన్ని, సంఘంలో అది ఇచ్చే సౌకర్యాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది అనుమానమే” అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ సినిమా ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మనం కూడా వేచి చూడవలసినదే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.