పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హించాల‌ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ముందు నుంచీ భావిస్తోంది. ఎక్కువ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఎక‌గ్రీవంగా గెలిపించుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంద‌రూ ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 శాతానికి మించి ఏక‌గ్రీవాలు చేయ‌లేక‌పోతున్నారు. కానీ, చిత్తూరు జిల్లా పుంగ‌నూరు, గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో మాత్రం భారీగా ఏక‌గ్రీవాలు జ‌రిగాయి.

పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 85 పంచాయ‌తీలకు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా మొత్తం 85 స్థానాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లా మాచ‌ర్ల నుంచి ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 77 పంచాయ‌తీలు ఉంటే 74 పంచాయ‌తీల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించారు.

అయితే, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌వంతంగా ఏక‌గ్రీవాలు జ‌రుగుతున్నాయ‌ని, పెద్దిరెడ్డి, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, మొద‌టి రెండు విడ‌త‌ల‌తో పోల్చితే మూడో విడ‌త‌లో భారీగా ఏక‌గ్రీవాలు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిల్లోనూ వైసీపీనే ఎక్కువ‌గా గెలుచుకోనుంది.