కరోనాకు విరుగుడుగా ప్రపంచానికి ఏంటో మేలు చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వాక్సిన్ కాస్తా ప్రమాదకారి అనే భయాలు వ్యాపించడం వల్ల చాల దేశాలు అప్రమత్త మయ్యాయి. ప్రతిరోజూ ఎదో ఒక సందర్భంలో వాక్సిన్ తీసుకున్న వ్యక్తికి కరోనా సోకడమో లేక మరణించడమో జరుగుతుందన్న వార్త మనం చదువుతూనే ఉన్నాము. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.


టీకాలలో అత్యధికంగా అమ్ముడవుతోన్న వ్యాక్సిన్ గా ఉన్న ‘ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్’ సమర్థతపై అనుమానాలు తలెత్తాయి. స్విడిష్-బ్రిటిష్ సంస్థ అయిన ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం సంస్థతో కలిసి రూపొందించిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ను భారత్ లో విరివిగా వాడుతోన్న సమయంలో రక్తం గడ్డకడుతున్నదన్న భయం కారణంగా ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఎనిమిది దేశాలు నిలిపివేశాయి.

డెన్మార్క్ ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ తీసుకున్న కొంతమంది తమ శరీరంలో రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. డెన్మార్క్ ఈ ప్రకటన చేసిన తర్వాత నార్వే, ఐస్ లాండ్ దేశాలూ ఆస్ట్రాజెనికా టీకాను తాత్కాలికంగా నిలిపేయగా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్ దేశాలు కూడా తదుపరి బ్యాచ్ నుంచి వ్యాక్సిన్ల వాడకాన్ని నిలిపివేశాయి. కానీ ఇది టీకా తీసుకోవడం వల్లనే జరిగి ఉండొచ్చన్న ఆధారాలేవీ లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ 17 యూరోపియన్ దేశాలకు మిలియన్‌ డోసులకు పైగా పంపిణీ జరిగింది.

యాంటీ-కోవిడ్ డోసు అందుకున్న 49 రోజుల తర్వాత ఆస్ట్రియాలో ఒక నర్సు ‘తీవ్రమైన రక్తం గడ్డకట్టిన సమస్యతో’ మరణించిన తరువాత ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వాడకంపై అనుమానాలు పెరిగాయి. మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో మూడు మిలియన్ల మందికి పైగా టీకాలు వేసిన వారిలో 22 రక్తం గడ్డకట్టినట్లు కేసులు వచ్చాయని ఈఎంఏ తెలిపింది. కానీ దీనిని నిలిపివేయడం అన్నది తాత్కాలికమే కానీ పూర్తిగా రద్దు చేయలేదు అని డానిష్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకు ఒకరు మరణించారని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ మరణంపై ఈఎంఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం వయోజనులకు జూలై ఆరంభానికి బదులుగా ఆగస్టు మధ్య నాటికి టీకాలు వేయాలని ఆశిస్తున్నట్లు ఆరోగ్య అధికారులు పేర్కొంటున్నారు. కాగా, యూరప్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా సంస్థ భారత్ లో తన భాగస్వామి సీరంతో కలిసి అభివృద్ది చేసిన కొవిషీల్డ్ విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. కొవిషీల్డ్ పై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదుకాకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కొవిషీల్డ్ పై పడింది.