తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొలాకులలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతు కాగా, ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ(36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు(46), ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడలో బంధువులు ఉండటంతో శివరాత్రి వేడుకలకు గురువారం వచ్చి తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తున్న సమయంలో లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా, మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. సురేష్‌ వర్మ, శ్రీనివాస్‌రాజుల మృతదేహాలు లభ్యం కాగా, వెంకటసత్యనారాయణరాజు కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వివరించారు.