ఇండియా లో 24 గంటల వ్యవధిలో 22,854 మందికి వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తుంది. 2021 మొదలైన తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి! చివరిసారిగా గత ఏడాది డిసెంబరు 25న అత్యధికంగా 23,067 కేసులు నమోదయ్యాయి.
గురువారం నాటికి దేశంలో మొత్తం 1,12,85,561 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 126 మంది మృతి చెందగా ఇప్పటికి కొవిడ్‌ మరణాలు 1,58,189కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో రికవరీల రేటు 96.92%గా, మరణాల రేటు 1.40%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా కొన్ని ప్రాతాలు లాక్డౌన్ కి గురి అవుతున్నాయి. దేశంలో మొత్తం 1,86,274 ఆక్టివ్ కేసులుండగా, వాటిలో ఒక్క మహారాష్ట్రలోనే 99,008 ఉన్నాయి. నాగపూర్ ఇప్పటికే లాక్ డౌన్ కు గురికాగా, పుణె సహా మరికొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ముంబయి, నాసిక్‌, పుణె, అకోలా, నాగ్‌పుర్‌లో కేసుల ఉద్ధృతి అధికంగా ఉంది. బుధవారం ఆ రాష్ట్రంలో 13,659 కేసులు నమోదయ్యాయి. లాతూర్‌లోని ఓ వసతిగృహంలో 44 మందికి ఒక్కసారిగా మహమ్మారి సోకింది! దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న 10 జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్రకు చెందినవే కావడం శోచనీయాంశం. ఆ రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణాల్లోనూ అలాంటి పరిస్థితే ఉన్నట్టు తెలిపింది.