చిత్తూరు విద్య నగరంలోని ప్రైవేటు పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో కమిషనర్‌ విశ్వనాథ్‌ వెంటనే ఆయా పాఠశాలల్లో శానిటైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించడంతో గురువారం సిబ్బంది వెంటనే శానిటైజ్‌ చేసి ఆ ఆవరణ మొత్తాన్ని గేట్ మూసివేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

నగరంలోని బాలాజీకాలనీలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో నాలుగు రోజుల ముందు ఓ విద్యార్థినికి, కొంగారెడ్డిపల్లెలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఓ విద్యార్థికి, తరువాత మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో ఆ విద్యాసంస్థల యాజమాన్యం వైఫల్యం చెందడంతో వారం రోజులు పాఠశాల, జూనియర్‌ కళాశాలను మూసివేయాలని కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు.
పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల తరగతి గదిలోని మిగిలిన వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని, కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించాలని నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన వారిపై కొవిడ్‌-19 రెగ్యులేషన్‌-2020 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.