ఉత్తర ఈజిప్టులోని అల్ క్వాలిబియా నగరంలో గురువారం వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగి 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది గాయపడ్డారు. అగ్ని ప్రమాదాలను నిరోధించే వ్యవస్థలోని లోటుపాటుల్ని ఈ ప్రమాదం మరొక సారి బయటపెట్టింది. రాజధాని నగరం కైరోకు సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. స్థానిక వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేసే సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. ప్రాణ భయంతో కొందరు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


. మంటలను ఆర్పడానికి మొత్తం 15 ఫైర్ ఇంజిన్లను వినియోగించారు. నాలుగంతస్తులు గల భవనంలో పరిశ్రమలోనే తొలుత మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తరుచూ ఇటువంటి ప్రమాదాలు ఈజిప్టులో సర్వసాధారణమైపోయాయి. తాజా ఘటన ఈజిప్టులోని అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది.

గత నెలలో అక్రమంగా నిర్వహిస్తున్న లెదర్ ఉత్పత్తుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటలను అదుపుచేయడానికి సిబ్బంది ఒక్క రోజంతా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని కీలలకు భవనం ఆహుతికావడంతో మంటలను అదుపు చేసిన తర్వాత దానిని అధికారులు పూర్తిగా కూల్చివేశారు. గతేడాది డిసెంబరులో ఓ ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో మంటలు చెలరేగి ఏడుగురు కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.