హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ కింది భాగంలో ఫ్లైఓవర్ పిల్లర్లకు ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. నాలుగు రోడ్ల కూడలి, నిత్యం గ్యాప్ లేకుండా వాహనాలు తిరుగుతూ రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లైఓవర్ పై మంటలు, పొగలు వ్యాపించడంతో వాహనదారులు, స్థానికులు స్థంబించిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

పొగ కారణంగా ఆ సమయంలో అక్కడున్నవాళ్లు, చుట్టుపక్కల కార్యాలయాలు, దుకాణసముదాయాల్లోని వారిలో కొందరు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదం లేదని నిర్ధారించుకుని, ట్రాఫిక్ ను పునరుద్ధరించే దిశగా అడుగులేస్తున్నారు.

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సబంవించినట్లు ప్రాధమికంగా అంచనావేశారు. ఫ్లైఓవర్ పిల్లరకు ఏర్పాటు చేసిన డెకరేషన్ వస్తువులకు నిప్పు అంటుకోవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్టలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భద్రతా ప్రమాణాలపై ఈ నగరాన్ని ఆలోచనలో పడవేసింది.