కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ‌ వంటి చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో అవసరం అనిపిస్తే లాక్‌డౌన్‌ విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప సోమవారం అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, లాక్‌డౌన్‌ అనివార్యమైతే విధిస్తాం అని, అలాంటి పరిస్థితి లేనప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.

ఆదివారం నాటికి రాష్ట్రంలో 10వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా తనతో స్వయంగా మాట్లాడారని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని, కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధానికి వివరించా’ అని యడ్యూరప్ప తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌లు వాడాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ‘ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా సహకరించని పక్షంలో తప్పకుండా చర్యలు ఉంటాయి. అందుకు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సహకరించండని విజ్ఞప్తి చేశారు.