హైదరాబాద్ మెట్రో రైల్ కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టింది. మహమ్మారి మళ్లీ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రైళ్లను శానిటైజ్‌ చేయడంతో పాటు స్టేషన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ వద్ద ప్యాసింజర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నది. మండుతున్న ఎండల దృష్ట్యా మెట్రోలో ప్రయాణించేందుకు నగరవాసులు మొగ్గు చూపుతుండగా, రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అత్యుత్తమ సేవలందిస్తున్నది . మెట్రో జర్నీ సాఫీగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం చేరవేసేలా ఏర్పాట్లు చేసింది.

రైళ్లలో ప్రయాణం చేస్తూ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్‌ వంటి అంశాలను ప్రయాణికులకు వివరిస్తున్నారు. అన్ని స్టేషన్లలోని ఎంట్రీ, ఎగ్జిట్‌లను తమ నియంత్రణలోకి తీసుకొని కొన్నింటిని మాత్రమే తెరిచి వాటి నుంచే ప్రయాణికులు వచ్చి వెళ్లేలా, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకునేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్‌చేంజ్‌ మెట్రో స్టేషన్‌లైన అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, పరేడ్‌గ్రౌండ్‌లో రద్దీకి అనుగుణంగా థర్మల్‌ స్క్రీన్కింగ్‌ చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచి కౌంటర్ల వద్ద క్యూ లైన్లు లేకుండా మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌తోనే టికెట్‌గా మార్చుకొని ప్రయాణం చేసేలా ప్యాసింజర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

మున్ముందు రద్దీ పెరిగే అవకాశముండటంతో ఎక్కడా నిర్లక్ష్యం చూపకుండా ప్రయాణికులకు సురక్షితమైన, భద్రతతో కూడిన ప్రయాణం మెట్రోలోనే సాధ్యమనేలాహెచ్‌ఎంఆర్‌ యంత్రాంగం పనిచేస్తున్నది.