పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతవ్వగా వారిలో ఒకరు మృతి చెందారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతుని పేరు సత్యనారాయణగా గుర్తించారు. ఆరుగురు యువకులు నిన్న ఓ సినిమా చూడటానికి కొవ్వూరుకు వెళ్లి తిరిగి వస్తూ సాయంత్రం ముగ్గురు యువకులు స్నానానికి గోదావరిలో దిగగా మిగతా ముగ్గురు తినుబండారాల కోసం వెళ్లారు. నదిలోకి దిగిన ముగ్గురు ప్రవాహ వేగానికి కొట్టుకుపోగా వీరిలో సత్యనారాయణ మృతదేహం గోష్పాద క్షేత్రం వద్ద లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులను హేమంత్‌, సోమరాజుగా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.