వార్తలు (News)

జీవో నెంబర్‌ 2 సస్పెండెడ్ .. ఏపీ హైకోర్టు??

ఏపీ ప్రభుత్వం మార్చి 25న గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జీవో నెంబర్‌ 2ను జారీచేసిన విషయం పాఠకులకు విదితమే! అయితే గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ దీనిపై వ్యాజ్యం దాఖలు చేయడంతో హైకోర్టు ఇవాళ దానిపై విచారణ జరిపింది. పంచాయితీ కార్యదర్శుల హక్కుల్ని హరించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు జీవో నెంబర్‌ 2ను సస్పెండ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలూపగా, ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ల కూడదని అడిగింది.

రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోషియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ బుచ్చిరాజు అన్నారు. డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారాలు పంచాయతీ కార్యదర్శులకే ఉండాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •