జాతీయం (National) వార్తలు (News)

ఖంగు తినిపిస్తున్న ‘ టమాటా’ ధర!!

సామాన్య ప్రజలు నిత్యం కూరలలో వాడే టమాటా ధరలు చూస్తుండగానే పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వారం పది రోజుల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో 15 నుంచి 20 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా 60 రూపాయలకు, కాస్త నాణ్యతతక్కువగా ఉన్నదైతేకిలో 50 రూపాయలకు చేరింది.

నిత్యం ఏదో ఒక కూరలో తప్పని సరిగా వినియోగించే టమాటా ధర పెరిగిపోవడానికి కారణం ఏంటని సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వ్యాపారులు మాత్రం మార్కెట్‌కు దిగుమతులు తగ్గడమే కారణమని చెబుతున్నారు. ప్రత్యేకించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో టమాటా పంట పాడైపోయిందని, దీంతో రోజువారీగా హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలి వచ్చే టమాటాలో ప్రస్తుతం 50శాతానికి పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ముఖ్యంగా తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలల నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటా దిగుమతి అవుతుంది. అలాగే బెంగళూరు, మహారాష్ట్ర, రాజస్ధాన్‌ నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటా దిగుమతి జరుగుతోంది. అయితే సాధారణ రోజుల్లో అయితే నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లు, రైతుబజార్‌లకు రోజుకు 150 నుంచి 180 లారీల టమాటా తరలి వస్తుండగా, ప్రస్తుతం 80 లారీలుకూడా రావడం లేదని నగరంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ అయిన గుడిమల్కాపూర్‌లోని వ్యాపారి ఒకరు తెలిపారు. మార్కెట్‌కు తరలి వస్తున్న టమాటా కూడా నాణ్యతతో రావడం లేదని, పంట పూర్తిగా చేతికి రాకముందే వర్షాలకు రాలిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, కొత్త పంట చేతికి వచ్చే వరకూ మరో రెండు నుంచి మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •