….. ఎగ్జిట్ పోల్స్ పట్టుకోలేకపోవచ్చు, పెద్ద పెద్ద తలకాయలు అంచనా వేయలేకపోవచ్చు, మీడియా చెప్పలేకపోవచ్చు…. కానీ అందరికీ పోలింగ్ ముగిశాక తెలుస్తూనే ఉంది… ఆరోజు టీఆర్ఎస్ క్యాంపు అంతా నిశ్శబ్దం… అప్పుడే అర్థమైపోయింది… కారుకు యాక్సిడెంట్ అయ్యిందని…! కానీ ఎక్కడో ఏ మూలో అందరికీ ఆశ… హరీష్‌రావు ఏదో మాయ చేసి ఉంటాడులే అని…. కానీ తన చేతుల్లోనూ ఏమీలేదు… నిజానికి తను ప్రచారం సమయంలోనే ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నప్పుడే చాలామందికి తెలిసిపోయింది… ఈసారి దుబ్బాక ఓ హిస్టారికల్ కథేమిటో చెప్పబోతోందని… కానీ ఎవరూ బహిరంగంగా చెప్పలేకపోయారు… కారణం… భయం… పైగా టీఆర్ఎస్ అంటే, అది ఎవరూ కొట్టలేని ఓ పెద్ద తోపు పార్టీ అనే భ్రమల్లోనే ఉండిపోవడం…
చివరకు తలసాని కూడా ఒక్క వోటుతో గెలిచినా గెలిచినట్టు అని నోరుజారాడు… ఆ దెబ్బకు లక్ష వోట్ల మెజారిటీ ప్రగల్భాలు కాస్త పక్కుమని నవ్వినయ్… అసలు తెలంగాణ పల్లెకు ప్రతీకలాంటి దుబ్బాక అంతిమంగా ఏం చెప్పింది…? పెద్ద పెద్ద విశ్లేషణలు, చాటభారతం వంటి సుదీర్ఘ పోస్ట్‌మార్టం రిపోర్టులూ అక్కర్లేదు… చాలా సింపుల్… కొన్ని స్ట్రెయిట్ ముక్కల్లో చెప్పుకోవచ్చు దుబ్బాక ఫలితాన్ని….
కేసీయార్ పాలన తీరు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది… ఈ వ్యాధి లక్షణాన్ని దాచుకుని ప్రయోజనం లేదు, ఇంకా ముదురుతుంది… చికిత్స చేసుకోవాల్సిందే… మల్లన్నసాగర్ ముంపు పరిహారాల దగ్గర్నుంచి నిన్నామొన్నటి ఎల్‌ఆర్ఎస్, ఇంటింటి ఆస్తుల సర్వే దాకా… బోలెడు…
రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసింది… టీఆర్ఎస్‌కు అది ఇక ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదని ప్రజలకు అర్థమైంది… జనానికి బీజేపీ కనిపిస్తోంది…
గతంలోలా బీజేపీ సాగిలబడటం లేదు… తొలిసారిగా ఢీఅంటేఢీ అంటోంది… బండి జోరుగా ఉంది… అది మేనేజ్ చేయడానికి కొరుకుడు పడని కేరక్టర్… పార్టీ కేడర్ జోష్ మీద ఉంది… అది కేసీయార్‌కు సవాల్ విసురుతోంది బలంగా…
ఆఫ్టరాల్ ఒక ఉపఎన్నిక అని తీసిపారేయకండి… ఎక్కడో మూడో స్థానంలో ఉండీలేనట్టు ఉండాల్సిన బీజేపీ… తొడగొట్టి, బరిలో నిలిచి… కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి… కారును ఎత్తికుదేసింది… బీజేపీ అభ్యర్థికి సానుభూతి అని తేలికమాటలూ కరెక్టు కాదు… అక్కడ సానుభూతి ఉంటే గింటే రామలింగారెడ్డి భార్యకు ఉండాలి కదా… అన్ని వ్యవస్థల్ని వాడుకున్నారు… డబ్బులు… కేసులు, బెదిరింపులు… ప్రలోభాలు… ప్రతిష్టాత్మకంగా బలగాల్ని మొహరించారు… ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధిపేటలో అడ్డా వేసి మరీ కష్టపడ్డారు…
చివరకు ఏం జరిగింది… ఆల్రెడీ ఓటరు డిసైడై ఉన్నాడు… ఇది కేసీయార్ ప్రభుత్వ వ్యతిరేక వోటు… అక్కడ రఘునందన్ ఉన్నా, మరొకరు ఉన్నా ఇలాగే ఉండేది… బీజేపీ ఓడిపోయినా సరే… టీఆర్ఎస్ పెద్ద బలమైన పార్టీ ఏమీ కాదు, పెళుసు… దాన్ని ఈజీగా కొట్టేయవచ్చు అని బీజేపీ చాటిచెప్పింది… కాంగ్రెస్ పార్టీకి చేతకాని ఆల్టర్నేట్ మొహాన్ని చూపించింది…
నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినప్పుడే కేసీయార్‌కు అర్థం కావాలి… కానీ అసెంబ్లీ గెలుపు అర్థం కానివ్వకుండా అడ్డుపడింది… ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమైనా తనకు నిజమేమిటో చెప్పి ఉండాల్సింది… స్థానిక ఎన్నికల్లో గెలుపు మరోసారి అడ్డుపడింది… బోలెడన్ని కారణాలున్నయ్… ఆ చర్చ ఒడిశేది కాదు, తెగేది కాదు… కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను టీఆర్ఎస్ గుర్తిస్తుందా..? అదొక్కటే అసలు ప్రశ్న… చివరగా… దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు, రఘునందన్ కాదు… ప్రభుత్వం పట్ల ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకత,.. ప్రజాగ్రహం… కోపమొచ్చనా సరే, కొన్ని నిజాలు ఇలా చేదుగా వినిపిస్తయ్… స్వీకరించాలి… చికిత్స మొదలుపెట్టాలి….
ఇక్కడ ఓడిపోయింది నిజానికి హరీష్‌రావు… అదేమిటి..? అనే ఓ కీలక ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు… టీఆర్ఎస్ పార్టీలో, కేసీయార్ కుటుంబంలో, ప్రభుత్వంలో… భవిష్యత్తులో దొరుకుతయ్..