వార్తలు (News)

మునిసిపల్‌ గ్రాంట్ల కింద 581 కోట్ల బకాయిలు విడుదల చేయండి కేంద్ర మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి లేఖ

పత్రికా ప్రకటన
˜
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 581.60 కోట్ల రూపాయలను త్వరితగతిన విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపాలిటీలకు 3,635.80 కోట్ల రూపాయలను గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. ఈ మొత్తం నిధులను పట్టణాలు, నగరాలలో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుంది. మునిసిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు 3054.20 కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆయన తెలిపారు.
తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్‌ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించింది. మునిసిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టింది. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న 581.60 కోట్ల మునిసిపల్‌ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.