వార్తలు (News)

రైతు ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రగతి భవన్‌ ముట్టడి

హైదరాబాద్‌: రైతు ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రగతి భవన్‌ ముట్టడికి విఫలయత్నం చేశారు. ప్రగతిభవన్‌ ఎదుట మౌనదీక్ష చేయడానికి కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి తరలి వచ్చిన రైతు ప్రతినిధులను పోలీసులు అడ్డుకుని గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి సన్న రకాలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వం చెబితేనే వేశారని.. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు, వరదల తీవ్రతకు పంట దెబ్బతినిందని వాపోయారు. దీంతో ధాన్యం ముక్కిపోయి, రంగు మారిపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

తక్షణమే క్వింటాకు రూ.2,500 చొప్పున రైతులకు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో వ్యవసాయ పంటలు దెబ్బతిన్న రైతులకు కనీస మద్దతు ధరలు రాక మరింతగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సరిగా కొనుగోలు చేయటం లేదని వారు ఆరోపించారు. అన్ని రకాల పంటలు గిట్టుబాటు ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు బయలుదేరితే పోలీసులు అడుగడుగునా అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.