గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులకు అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రిటర్న్​ టూ ఆఫీస్​ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్​గా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా పొడిగించిన వర్క్‌ఫోర్స్, ఇంటర్న్‌లతో సహా ఉద్యోగులందరికీ గూగుల్ ఈనెలలో 1,600 డాలర్లు లేదా సమానమైన విలువను ఒకేసారి నగదు బోనస్‌గా ఇస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఈ బోనస్​ను సంస్థ నియమించుకున్న ఫ్రీలాన్సర్​లకు, ఇంటర్న్‎​లకు కూడా ఈ ఒన్ టైం క్యాష్​ బోనస్​ వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు గూగుల్​ వెల్లడించింది.

కరోనా వైరస్​ వ్యాప్తి మరలా వేగవంతం అవుతుండడంతో ఉద్యోగులకు మద్దతుగా నిలవడానికి వర్క్​ఫ్రమ్-హోమ్ అలవెన్స్​, వెల్‌బీయింగ్ బోనస్‌తో పాటు తాజాగా ప్రకటించిన బోనస్‎​ను కూడా జమ చేయనుంది. గత మార్చిలో గూగుల్ అంతర్గత సర్వేలో ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోవట్లేదని తేలింది. ఆ తర్వాత కంపెనీ 500 డాలర్ల నగదు బోనస్‌తో సహా అనేక ప్రయోజనాలను ప్రకటించింది. జనవరి 10 నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని భావించినప్పటికీ ఒమిక్రాన్​ భయాలతో ఆ నిర్ణయం మార్చుకుంది.