తమిళనాడు జిల్లా ఈరోడ్ జిల్లా చితోడ్ సమీపంలోని బ్లీచింగ్ పౌడర్ తయారీ ప్యాక్టరీలో శనివారం లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీక్ అయి కార్మికులు ఒకరు చనిపోగా పదికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వడంతో కార్మికులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అశ్వస్థతకు గురైన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తిని స్థానిక నడుపాళయం గ్రామానికి చెందిన దామోధరన్ గా అధికారులు గుర్తించారు. ఈయన శ్రీధర్ కెమికల్స్ పేరుతో బ్లీచింగ్ పౌడర్ తయారీ యూనిట్ నడుపుతున్నాడు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీక్ కావడం వల్ల, దామోధరన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి మూర్చపోయి చనిపోయాడని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఈరోడ్ జిల్లా కలెక్టర్ హెచ్ కృష్ణనున్ని తెలిపారు.

ఈ సంఘటన అనంతరం ఈరోడ్ మరియు పెరుందురై అగ్నిమాపక కేంద్రాల నుండి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని టెక్నీషియన్ సహాయంతో లీకేజీని మూసివేశారు. ఘటన స్థలంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. ఈ ఘటనపై చితోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.