ఇంధనంతో నడిచే వాహనాలు క్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు. ఈ కారణంగానే ఇప్పటికే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి.. భవిష్యత్‌లో వాహనరంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక భూమిక పోషించనున్నాయి. ఇక, ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. ఈ విషయాన్ని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య తెలిపారు
టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఇలా తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని, రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ ఈ సబ్సిడీ ఉంటుందని వెల్లడించారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్’పేరుతో రోడ్ షో నిర్వహించనున్నామని, రూ.50 వేల నుంచి రూ.30 లక్షల విలువ చేసే అన్ని రకాల వాహనాలను ఈ రోడ్ షోలో ప్రదర్శనకు ఉంచుతామని, 60 స్టాల్స్, చార్జింగ్ పాయింట్లు ప్రదర్శనకు ఉంటాయని జానయ్య తెలిపారు.