మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మనిషికి మొదటి శత్రువు భయం. ఆ భయం ఎలాంటి దారుణానికి అయినా తెగించేలాగా చేస్తుంది. ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని తన చేతులారా పొట్టనబెట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించాడు. ఇక ఇటీవల ఒమిక్రాన్ వైరస్ వస్తుందని తెలియడంతో దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. అందులో ఒమిక్రాన్ కి మందు లేదని తెలుసుకుని అప్పటినుంచి చావు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాడు.

ఒకవేళ భార్య పిల్లలకు ఒమిక్రాన్ వస్తే తానూ సాయం చేయలేనని , కాపాడుకోలేనని భయపడి దారుణమైన ఆలోచన చేసాడు. తన కళ్ళముందే భార్యాపిల్లలు కొద్దికొద్దిగా చనిపోవడం చూడలేనని, తనకి ఏదయినా అయితే వారు ఏమవుతారో అని అనుకుని తన చేతులతో తానే భార్యాపిల్లల గొంతుకోసి హతమార్చాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. డాక్టర్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని పోలీసులుఅభిప్రాయపడుతున్నారు.