జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల వారు అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను భోగితో ప్రారంభించి ముక్కనుమతో పూర్తి చేస్తారు. అయితే భోగి రోజు ప్రతి ఒక్కరు భోగి మంటలు వేసుకుని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాగే భోగి రోజు పిల్లలకు భోగిపళ్ళు పోయడం కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది.

భోగిపళ్ళు పిల్లలకు పోయటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు. కానీ దాని విధి విధానాలను ఎలా పాటించాలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా భోగి పళ్ళు పిల్లలపై మొదటగా ఎవరు పోయాలి.. అనంతరం భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి ఎవరు ఇవ్వాలి అన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా పిల్లలకు స్నానం చేయించి శుభ్రమైన దుస్తులు ధరింపజేసి తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి. అనంతరం వారికి తల్లి మొదటగా పిల్లల నుదుటిపై కుంకుమ పెట్టి ఆ తర్వాత భోగి పళ్ళను వారి తలపై ఉంచి ముందుగా మూడు సార్లు కుడివైపుకు తిప్పాలి.అలాగే మరో మూడు సార్లు ఎడమ వైపుకి తిప్పి తలపై పోయాలి. అనంతరం అక్షింతలు వేసి తన బిడ్డను ఆశీర్వదించాలి.

ఇలా మొదటగా భోగిపళ్ళను తల్లి వేసిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల వారు కూడా పిల్లలపై భోగి పళ్ళు వేసి ఆశీర్వదించాలి. ఇలా ప్రతి ఒక్కరు పిల్లలపై భోగి పళ్ళు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఐదుగురు వృద్ధ మహిళలు పిల్లలకు మంగళహారతి ఇచ్చి ఆ హారతి బయట పడేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల పై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని శాస్త్రం.