ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపార సంస్థలపై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే! అయితే మూడు సంస్థల్లో గతవారం జరిపిన ఈ దాడుల్లో వందల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించగా ఈ మూడు కంపెనీల్లోనే దాదాపు రూ.800కోట్ల మేర లెక్కకురాని నగదు లావాదేవీలు గుర్తించినట్లు ఐటీ శాఖ సోమవారం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగంతో సంబంధమున్న పలు సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలతోపాటు ఇతర ప్రదేశాల్లో జనవరి 5న ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. కర్నూలు, అనంతపూర్‌, కడప, నంద్యాల, బళ్లారితోపాటు మొత్తం 24చోట్ల ఈ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించి చేతిరాత పుస్తకాలు, ఒప్పంద డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతోపాటు పలురకాల ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను సీజ్‌ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తాజా ప్రకటనలో పేర్కొంది.

అంతేకాకుండా లావాదేవీల్లో తేడాలు గుర్తించకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మార్పుచేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ను ఓ సంస్థ వినియోగిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆయా సంస్థలు వాస్తవ భూమి విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరిస్తూనే ఆ లెక్కలోకి రాని నగదుతో భూమి కొనుగోళ్లు, ఇతర ఖర్చులకు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో రూ.1.64కోట్ల లెక్కలోకి రాని నగదును సీజ్‌ చేయగా, దాదాపు రూ.800కోట్ల మేరకు ఇలాంటి లావాదేవీలను గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.