కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని చుట్టుముడుతుండగా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తుండగా పలు రాష్ట్రాలు విద్యాలయాల్ని కూడా మూసివేస్తున్నాయి. ఇదే విధంగా తెలంగాణలో సైతం విద్యాలయాల సెలవులు పొడిగించనున్నట్టు తెలుస్తోంది.

కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని బలంగా తాకడంతో ప్రతిరోజూ భారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలతో పాటు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాలయాల సెలవుల్ని పొడిగించే దిశగా విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు.

తెలంగాణలో జనవరి 8 నుంచి 16 వరకూ సంక్రాంతి సెలవులున్నాయి. 17వతేదీ నుంచి విద్యాలయాలు, కళాశాలలు తిరిగి తెరుచుకోవాలి అయితే కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని సెలవుల్ని పొడిగించాలనేది విద్యాశాఖ అధికారుల ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.