జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ లేదంటే పొలిటికల్‌ సైన్స్‌ డిగ్రీలు ఉంటె తప్ప న్యూస్‌ రీడర్‌ కాలేరా అని కొంతమందిని వేధించే ప్రశ్న! ఎందుకంటే ప్రస్తుతం చానల్స్‌లో న్యూస్‌రీడర్లుగా పనిచేస్తున్నవారంతా దాదాపు జర్నలిజంలో శిక్షణ పొందినవారే.

ఎలక్ట్రానిక్‌ లేదా ప్రింట్‌ ఏ రంగంలో పనిచేయాలన్నా మీకు మంచి రాత నైపుణ్యాలు, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు అవసరం. ఈ రంగంలో పనిచేయాలనుకునేవారు రోజువారీ సమస్యల నుంచి కొత్త కోణాలను వెలికితీసి స్టోరీలను తయారు చేయగలగాలి.న్యూస్‌ రీడింగ్‌ వైపు వెళ్లాలనుకునేవారికి మాట చాతుర్యంతోపాటు సమస్యలపై మరింత అవగాహన అవసరం. ఒక ఇష్యూ జరగ్గానే చర్చ నిర్వహించాలంటే దాని పూర్వాపరాలు తెలిసి ఉండాలి. మంచి కంఠం, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, క్లుప్తంగా, అర్ధవంతంగా చర్చచేయగలిగేవారు ఈ రంగంలో రాణిస్తారు.

దానికి తోడు జర్నలిజంలోకి వెళ్లాలనుకునేవారు క్రమం తప్పకుండా దినపత్రికలు చదవాల్సి ఉంటుంది. ఎడిటోరియల్‌ పేజీ చదవడం వల్ల సమస్యలపై అవగాహన పెరుగుతుంది. జర్నలిస్టు కావడానికి ప్రత్యేకమైన అర్హత అంటూ ఏమీ లేదు. పైన చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తులకు జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ లేకున్నా ఫీల్డ్‌లోకి తీసుకుంటున్నారు. అయితే ఇటీవల పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. డిగ్రీ తప్పనిసరి అని పేర్కొంటున్నారు. మీడియాలోకి కూడా విదేశీ పెట్టుబడులు వస్తే, పరిస్థితి మరింత మారే అవకాశం ఉంది. అప్పుడు జర్నలిజం డిగ్రీ తప్పనిసరిగా అవుతుంది. జర్నలిజంలోకి ఎంటర్‌ కావాలనే ఆలోచన మీకు ఉంటే డిగ్రీ కాగానే బిసిజెలో ప్రవేశం కోసం ఎంట్రెన్స్‌ రాయండి. తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలతోపాటు దేశంలోని దాదాపు అన్ని వర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. వృత్తికి సంబంధించిన అర్హతలు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.