హైదరాబాద్ షేక్ పేటకు చెందిన దగ్గరి కుటుంబాల వారు 26 మంది ప్రయాణిస్తున్నబస్సు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో ప్రమాదానికి గురైంది. అనంతగిరి 5వ నెంబర్ మలుపు వద్ద 200 అడుగుల లోయలో పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 22 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారని విశాఖపట్నం రూరల్ ఎస్పీ కృష్ణారావు శుక్రవారం రాత్రి బీబీసీకి చెప్పారు. గాయపడిన 19 మందికి ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని అనంతగిరి ఎస్ఐ సుధాకర్ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో అన్నారు.

గాయపడిన వారందరిని మొదట విజయనగరం జిల్లా ఎస్. కోట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో పాటు 8 నెలల నిత్య అనే పాప కూడా ఉంది. 

ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ షేక్ పేట నుంచి 26 మంది ఏపీలోని వివిధ ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. నిన్నటి వరకు ఆ టూర్ ప్లాన్ ప్రకారం సవ్యంగా సాగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అక్కడ కనకదుర్గ గుడి, అక్కడ నుంచి మంగళగిరి, అక్కడ నుంచి అన్నవరం వెళ్లిన వీరంతా… గురువారం సింహాచలంలో దర్శనం చేసుకుని, రాత్రి అక్కడే బస చేశారు. అక్కడ నుంచి శుక్రవారం ఉదయం అరకు వెళ్లారు.

అన్నీ చూసుకుని అనంతగిరి వచ్చేసరికి…

శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అరకులోని టూరిస్ట్ స్పాట్లను చూసి సరదాగా గడిపారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ పయనమయ్యారు. రెండు రోజుల పాటు దర్శించిన ఆలయాలు, చూసిన ప్రదేశాల ముచ్చట్లు చెప్పుకుంటుండగానే అరకు నుంచి బయలుదేరిన బస్సు అనంతగిరి, డముకు గ్రామం చేరుకుంది. అక్కడ 5వ నెంబర్ మలుపు వద్ద బస్సు ఒక్కసారిగా లోయలోకి దూసుకుని వెళ్లింది. చుట్టూ చీకటి…ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు. బస్సులోని వారంతా కాపాడండంటూ అరుపులు, కేకలు వేశారు.

“మాకు ఏవో అరుపులు వినిపించాయి. బహుశా బస్సు లోయలోకి పడుతున్పప్పుడు, బస్సులోని వారంతా భయంతో అరిచినట్లు ఉన్నారు. కేకలు విన్న మేం బస్సు పడిన చోటుకి చేరుకున్నాం. వెంటనే లోయలోకి దిగి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంతమందినైతే అంతమందిని పట్టుకుని పైకి తీసుకొచ్చాం. వారందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఇంకా లోయలో చాలా మంది ఉన్నట్లు అనిపించింది. అయితే, ముందుగా పైకి తీసుకొచ్చిన వారిని బతికించుకోవాలనే ఉద్దేశంలో ఆలస్యం చేయకుండా ఎస్. కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకుని వచ్చాం. మాటల్లో వారు హైదరాబాద్ నుంచి వచ్చారని తెలిసింది.” అని గాయాలపాలైన వారిని ఎస్. కోట ఆసుపత్రికి తీసుకొచ్చిన డముకు గ్రామ అంగన్ వాడీ టీచర్ లక్ష్మీ చెప్పారు.

డ్రైవింగ్ రాదు… పైగా బ్రేక్ ఫెయిల్

హైదరాబాద్ షేక్ పేటలోని దినేష్ ట్రావెల్స్ ద్వారా ఈ టూర్ ని బుక్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది షేక్ పేట చెందిన వారు. కొందరు ఆ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. 

“మేం హైదరాబాద్ మణికొండలో ఉంటాం. సరదాగా పిక్నిక్ కి వెళ్దామంటూ మా అక్క ఈ టూర్ ప్లాన్ చేసింది. బస్సుల్లో ఉన్నవాళ్లమంతా దగ్గర కుటుంబాల వాళ్లమే. మేం ముందు అమరావతి, విజయవాడ, మంగళగిరి, అన్నవరంలోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు వెళ్లి అక్కడ నుంచి విశాఖ వచ్చాం. విశాఖలో సింహాచలం దర్శనం చేసుకుని నిన్న ఉదయం(శుక్రవారం) అరకు వెళ్లాం. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది” అని ప్రాణాలతో బయటపడిన ఒక పర్యాటకురాలు చెప్పారు. 

“దినేష్ ట్రావెల్స్ వాళ్లు మా బస్సుకు ఇచ్చిన డ్రైవర్‌కు డ్రైవింగ్ సరిగా రాదు. అటువంటి వ్యక్తిని టూర్ బస్సుకు డ్రైవర్ గా పెట్టారు. అమరావతి నుంచే అతని డ్రైవింగ్ తో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అరకు వచ్చిన తరువాత తనకు ఘాట్ రోడ్ డ్రైవింగ్ సరిగా రాదని చెప్పాడు. అయితే, ఆగిపోదామని కూడా చెప్పాం. కానీ, మా మాట వినలేదు. మధ్యలో ఒక సారి బ్రేక్ ఫెయిల్ అయ్యిందని చెప్పాడు. మేం అంతా కంగారుపడ్డాం. అతనికి డ్రైవింగ్ రాదు, పైగా బ్రేక్ ఫెయిల్ అంటున్నాడని మేం మాట్లాడుకుంటుండగానే బస్సులో లోయలో పడింది. మొత్తం మేం 26 మంది వచ్చాం. అందులో 8 నెలల పాప ఉంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో ఆ పాప కుడా ఉంది” ఆమె చెప్పారు.

అది సిగ్నల్ ఉండని ప్రాంతం…

అనంతగిరి మండలం డముకు గ్రామంలోని 5వ నెంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన మలుపు. పైగా ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. ఏం జరిగినా బయలకు సమాచారం వెంటనే తెలిసే అవకాశం ఉండదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత సమాచారం అందుకున్న అనంతగిరి ఎస్ఐ సుధాకర్ అక్కడికి చేరుకున్నారు. 

“డముకు ప్రమాదకర మలుపు వద్ద బస్సు లోయలో పడిందని మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నాను. అప్పటీకే స్థానికులు కొందరు గాయాలపాలైన కొందరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని లోయలో నుంచి బయటకు తీసే ప్రయత్నం జరుగుతోంది. వెంటనే మేం, 108 సిబ్బంది కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. చీకటిగా ఉండటంతో సహాయ చర్యలలకు కష్టమైంది. ఘటన స్థలంలోనే నలుగురు చనిపోయారు. బస్సులోని 22 మంది గాయపడ్డారు. సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో సమాచారం కాస్త ఆలస్యంగా వచ్చింది.” అని సుధాకర్ చెప్పారు.

‘రిజర్వ్ బ్యాంక్ ఫ్యామిలీ’

షేక్‌పేటలో నివసిస్తున్న కె. సత్యనారాయణ… రిజర్వ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఆయన సోదరులు వారి బంధువులు అంతా కూడా షేక్ పేట, మణికొండ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరిని స్థానికులు ‘రిజర్వ్ బ్యాంక్ ఫ్యామిలీ’ అంటుంటారు. 

వీరంతా అప్పుడప్పుడు టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇళ్ళల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా అంతా హాజరు అవుతారు. కోవిడ్ కారణంగా గత ఏడాది ఎక్కడికీ వెళ్ళలేక పోవడంతో ఇప్పుడు వీరంతా అమరావతి నుంచి అరకు వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరి ట్రిప్ రెండు రోజుల పాటు ఆనందంగా సాగినా చివర్లో విషాదానికి దారి తీసింది.

మృతులు వీరే..

1. కె. సరిత (30),

2. కె. సత్యనారాయణ (50), 

3. ఎన్. లత (30), 

4. నిత్య (8 నెలలు) 

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు 

గాయపడిన 22 మందిలో 10 మందికి సీరియస్ గా ఉండటంతో వారిని విశాఖ కెజీహెచ్ కు తరలించారు. మిగిలిన 12 మందికి విజయనగరం జిల్లా ఎస్. కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు. 

కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారుస్వప్న (32), కె. శైలజా (30), కె. కళ్యాణి (30), కె. మీనా (38), కె. అరవింద్ (34), కె. లత (45), యు. కృష్ణవేణి (52), చంద్రలేఖ (42), కె. ఈష (30), అబ్రహం (7). వీరందరికి తలపై, ఛాతీపై బలమైన గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. 

ఎస్. కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో బస్సు డ్రైవర్ శ్రీశైలంతో పాటు సాన్వి (4), ఈష (5), కె. మౌనిక (27), కె. శివాని (6), కె. దేవాన్ష్ (5), కె. నరేష్ కుమార్ (38), కె. రితేష్ (17), నంద కిషోర్ (30), కె. అనిత (47), కె. మనశ్విని, విహాన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

కంట్రోల్ రూం ఏర్పాటు

ప్రమాదంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే అధికారులను అప్రమత్తం చేశాయి. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ రెవెన్యూ అధికారులను సహాయకచర్యలకు ఆదేశించారు. 

ప్రమాదంపై సమాచారం అందించేందుకు కంట్రోల్‌ రూం నెంబర్లను ఏర్పాటు చేశారు. (Control Room nos: 08912590102, 08912590100). అలాగే ఐటీడీఏ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు పంపించారు. 

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే రెండు రాష్ట్రాల సీఎంలు అయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల తక్షణం సహాయ చర్యలతో పాటు మెరుగైన వైద్యసేవలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, టూరిస్టులంతా హైదరాబాద్ లోని షేక్ పేట్ కు చెందిన వారు కావడంతో… వారి నివాసాలకు అధికారులను పంపించి…అక్కడ నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ

విశాఖ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్ లో తెలిపారు. అలాగే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.