అరకు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ప్రమాదం అరకు ఘాట్ రోడ్డులో దినేష్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. బస్సులో 34 మంది హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందిన పర్యటకులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది.
క్షతగాత్రులను విశాఖపట్నంలో ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మంచి వైద్యం అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ… సంఘటన జరిగినప్పుడు బస్సులో 34 మంది ఉండగా నలుగురు చనిపోయారని, ఏడుగురికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారని పేర్కొన్నారు.
మిగిలిన 23 మందిలో 16 మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. మిగతా ఏడుగురిలో ఐదుగురికి ఫ్రాక్చర్స్ అయ్యాయని, వీరికి సర్జరీలు అవసరమని తెలిపారు. ఒకరికి ముఖానికి బాగా గాయాలు కావడంతో ప్లాస్టీక్ సర్జరీ చేశారని, మరొకరికి తలకు బలమైన గాయం అయ్యిందని తెలిపారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించడానికి విశాఖ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించినట్లు తెలిపారు.