తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఈ నెల 19వ తేదీన స్వామి వారిని జగన్ దర్శించుకోనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతర్వేదిలో దేవాదాయ శాఖ తయారు చేయించిన నూతన రథాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. 19వ తేదీన పవిత్ర రథసప్తమి రోజున రథాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరామని, తప్పకుండా వస్తానని ఆయన చెప్పినట్లు వెల్లంపల్లి పేర్కొన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై వెల్లంపల్లి స్పందించారు. భక్తుల మనోభావాలు, ప్రతిపక్షాల అనుమానాల నేపథ్యంలో ఈ కేసును తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించిందని ఆయన తెలిపారు. అయితే, సీబీఐ ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదని, కేసును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, ఇప్పటివరకు కేసు విచారణ ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని తయారుచేయించింది. పీఠాధిపతుల సమక్షంలో రథసప్తమి నాడు రథాన్ని ప్రారంభించనున్నారు.