అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు సౌలభ్యం కలిగించడానికి వాటి సేవలను విస్తృతం చేస్తున్నాయి. దానిలో భాగంగానే గత ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) టైటాన్‌ భాగస్వామ్యంతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రారంభించింది. ఇప్పుడు
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్, తన వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయడానికి అనుమతించే అనేక రకాల పరికరాలను ప్రారంభించింది.

ఎస్‌బీఐ బ్యాంకు కస్టమర్లు అయితే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు చేయడానికి టైటాన్ వాచ్‌ను కొనుగోలు చేయాలి. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు రిస్ట్‌బ్యాండ్, కీచైన్, లూప్ అని పిలిచే ఒక చిన్న పరికరాన్ని తమ వాచ్ స్ట్రాప్ కి అమర్చుకుని కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు.

ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ అందించే కాంటాక్ట్ లెస్ చెల్లింపుల గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఏంటంటే…

  1. టైటాన్ పే వాచ్ లు రూ. 2,995 నుంచి ప్రారంభమవుతాయి. యాక్సిస్ బ్యాంక్ పరికరాలు రూ. 750 నుంచి ప్రారంభమవుతాయి. రెండు పరికరాలు కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ లేదా NFC ని ఉపయోగిస్తాయి. ఈ పరికరాల్లో NFC చిప్ ను పొందుపరుస్తారు. కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం ఈ పరికరాలు కస్టమర్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉంటాయి.
  2. పరికరం జారీ చేసిన 30 రోజుల్లోపు చేసే మొదటి మూడు లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ అందిస్తుంది. అయితే, దీని కోసం మీరు రూ. 600 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 100 క్యాష్‌బ్యాక్ ని అందిస్తుంది. దీనితో పాటు ప్రతి నెల వినియోగదారులు చేసే ఐదవ లావాదేవీపై కూడా బ్యాంకు క్యాష్‌బ్యాక్‌ ను అందిస్తుంది, దీని కోసం వినియోగదారులు కనీసం రూ. 200 తో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి కూడా గరిష్టంగా రూ. 100 క్యాష్‌బ్యాక్ ను బ్యాంకు అందిస్తుంది.

ఈ రెండు బ్యాంకులు అందించే పరికరాలు మాస్టర్ కార్డ్-ఎనేబుల్డ్ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ పై ఆధారపడి పని చేస్తాయి.

  1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, కార్డు పిన్ ను నమోదు చేయకుండా రూ. 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ పరిమితికి మించిన లావాదేవీల కోసం, వినియోగదారులు వారి పిన్‌ నెంబర్ ని ఉపయోగించి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లావాదేవీ విలువ రూ. 5,000 లోపు ఉన్నప్పటికీ, రోజులో కేవలం ఐదు లావాదేవీలు మాత్రమే పిన్ లేకుండా చేయవచ్చు.
  2. యాక్సిస్ బ్యాంక్ ఫ్రాడ్ కవర్‌ను కూడా అందిస్తుంది. బ్యాంకు లోపం లేదా థర్డ్ పార్టీ లోపం వలన జరిగే మోసాలకు అయితే కవరేజ్ లభిస్తుంది. కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా జరిగే మోసాలకు మాత్రం ఈ కవరేజ్ ఉండదు. సిమ్ డూప్లికేషన్ ఫ్రాడ్, ఐడెంటిటీ త్రేఫ్ట్ ఫ్రాడ్, అకౌంట్ టేక్ ఓవర్ ఫ్రాడ్, స్కిమ్మింగ్ లేదా కార్డ్ క్లోనింగ్ వంటి థర్డ్ పార్టీ ఉల్లంఘనలకు కవరేజ్ లభిస్తుంది. అలాగే, వినియోగదారులు ఫ్రాడ్ కవర్‌ ను పొందాలంటే మోసం జరిగిన మూడు రోజుల్లోపుగా బ్యాంకుకు తెలియజేయాలి.
  3. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు పరికరాల వార్షిక రుసుము రూ. 500 గా ఉంది. అదే ఎస్‌బీఐ విషయంలో వార్షిక రుసుముపై ఎలాంటి స్పష్టత లేదు.