ప్రస్తుతం ఇండియాలో 1 కోటి 10 లక్షలమందికి పైగా వైరస్‌ సోకగా, అందులో 1 లక్షా 57వేలమంది మరణించారు. రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులలో 21,200 కేసులతో పుణె అగ్రస్థానంలో ఉంది. 13,800 యాక్టివ్‌ కేసులతో నాగ్‌పూర్‌ రెండోస్థానంలో ఉంది.గత రెండు వారాలుగా నాగ్‌పూర్‌ జిల్లాలో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే ఈ జిల్లాలో 2000 కేసులు నమోదయ్యాయి. మార్చి 15 నుంచి 21వ తేదీ వరకు విధించిన ఈ రెండో లాక్‌డౌన్‌ నాగ్‌పూర్‌ నగరంతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది.

మొదటి నుంచి కూడా మహారాష్ట్ర కోవిడ్‌ హాట్‌స్పాట్‌గానే ఉంటూ వచ్చింది. దేశంలో ఎక్కడాలేని విధంగా మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత కొన్నివారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా, మహారాష్ట్రతోపాటు ఆరు రాష్ట్రాలలో మాత్రం కేసుల ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రకు చెందిన అమరావతి జిల్లాలో ఫిబ్రవరి నెలలో వారం పాటు లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పుడు నాగ్‌పూర్‌ నగరం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.

ఇక రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి వైరస్‌ కొత్త వేరియంట్లు కూడా ఒక కారణం కావొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధనలు పాటించకపోవడం కూడా మరో కారణము కావొచ్చని నిపుణులు అంటున్నారు.

మహారాష్ట్రలో ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం మానేశారు మరియు టెస్టింగ్‌ అండ్‌ ట్రేసింగ్‌లో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడైన డాక్టర్‌ సంజయ్‌ ఓక్‌ ఇటీవల బీబీసీతో అన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటి వరకు సుమారుగా 2 కోట్ల మందికి కనీసం ఒక డోస్‌ వ్యాక్సీన్‌ ఇచ్చారు. లాక్‌డౌన్‌ ఉన్నా నాగ్‌పూర్‌లో వ్యాక్సినేషన్‌ యథావిధిగా కొనసాగుతుందని ఆ రాష్ట్ర మంత్రి నితిన్‌ రౌత్‌ అన్నారు. “ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలలో 25 శాతం హాజరు ఉండేలా చూస్తున్నాం. ఇతర సంస్థలు, అత్యవసరం కాని షాపులు మూసేసి ఉంటాయి” అని ఆయన తెలిపారు.

నాగ్‌పూర్‌ నగరంలో ఆసుపత్రులు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు తెరిచే ఉంటాయి, రెస్టారెంట్లు మూతపడనుండగా, హోమ్‌ డెలివరీ సర్వీసులు కొనసాగుతాయి. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి.
నాగ్‌పూర్‌తోపాటు, కేసులు ఎక్కువగా ఉన్ననాలుగు జిల్లాల్లో పరిస్థితులను మహారాష్ట్ర అధికార యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రం మొత్తంలో ఉన్న యాక్టివ్‌ కేసుల్లో సగం కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయి.

“రాష్ట్రంలో మరెక్కడైనా లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉందేమో మరో రెండు రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం” అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.