ఛత్తీస్ గఢ్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణమృదంగం వినిపిస్తున్నాయి. రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు పట్టణాల్లోని ఆసుపత్రులలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకోవడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. కరోనా రెండో వేవ్ సమయంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని, శవాలను దాచేందుకు కూడా అవసరమైన వసతులు లేవని, మృతదేహాలను దాచే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచవలసి వస్తుందని డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబీకులు మృతదేహాలను తీసుకుని వెళ్లడం లేదని, అందుకే వాటిని ఉంచేందుకు సరిపడినన్ని ఫ్రీజర్ బాక్స్ లు లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉంచాల్సి వస్తోందని వెల్లడించారు. వారం రోజులుగా ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్లు 100 శాతం నిండిపోయి ఉన్నాయని, కొత్తగా ఆక్సిజన్ అవసరమైన వారికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.