భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చింతగుప్ప గ్రామంలో పోడు భూముల వివాదం అటవీ అధికారులపై గిరిజనుల దాడికి దారితీసింది. పోడు భూముల అంశంపై గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య సోమవారం ఉదయం తీవ్ర వివాదం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలో సుమారు 27 హెక్టార్లలో హరితహారం మొక్కలు నాటడానికి అటవీ సిబ్బంది కొద్దిరోజులుగా ప్రయత్నిస్తుండడంతో ఇవి తమ పోడు భూములంటూ గిరిజనులు గతంలో అనేకమార్లు అటవీ అధికారులతో ఘర్షణ పడ్డారు.

ఉదయం అటవీ సిబ్బంది డోజర్‌ వాహనంతో వివాదాస్పద భూముల్ని చదును చేయిస్తుండగా చింతగుప్పకు చెందిన గిరిజనులు పెద్దఎత్తున తరలివచ్చి డోజర్‌ను నిలిపివేసి, డ్రైవర్‌ రమేశ్‌ను కొట్టగా ఈ విషయాన్ని డి.కొత్తూరు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి(ఎఫ్‌బీవో) సోడి రాజేశ్‌కు డ్రైవర్‌ ఫోన్‌లో చెప్పడంతో సోడి రాజేశ్‌తో పాటు సుజ్ఞానపురం ఎఫ్‌బీవో విజయ, జిన్నెలగూడెం ఎఫ్‌బీవో హుస్సేన్‌లు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముగ్గురు ఎఫ్‌బీవోలపై గిరిజనులు కర్రలతో దాడిచేశారు. కొందరు గిరిజనులపై సీఐ నలగట్ల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.