తెలుగువారి సంవత్సరాది ఉగాది.. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు జరుపుకొంటారు. ఉగాది అంటే యుగమునకు ఆది, నక్షత్రమునకు ఆది అని అర్థం. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే జన్మ, నక్షత్ర గమనం అని అర్థం కాగా ఆది అనగా నక్షత్ర గమనం మొదలుకావడం, జన్మకు మొదలు అని కూడా అర్థాలుగా చెప్పవచ్చు.

రుతువులలో చైత్రం మొదటిది గనక చైత్రమాసంలో వచ్చిన ఉగాది అని అంటాం. చైత్ర శుక్లపాడ్యమి అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. మన పురాణాల్లో వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార ధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన నియమాలు
తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.

అభ్యంగన స్నానం: ఉగాది రోజున తప్పకుండా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ గంగా గంగా గంగా అని మూడు ఉచ్చరిస్తూ స్నానం ఆచరించాలి.

నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక వీలయితే నూతన వస్త్రాలు, లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రాల్లో చెప్పారు. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్‌ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!
నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ ఉచ్చరిస్తూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది.

ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి.