టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డబుల్ ఫీజులు!!

రాష్ట్రంలోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని సీట్ల ట్యూషన్​ఫీజు ప్రస్తుతం రూ.18 వేలు ఉండగా దానిని రూ.35 వేలకు పెంచాలని ఎంట్రెన్స్ అండ్ అడ్మిషన్స్ (సెట్స్) కమిటీ ప్రతిపాదన చేసింది. దీన్ని అన్ని యూనివర్సిటీలు ఆయా వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీల ఆమోదంతో అమలు చేయాలని, ఎగ్జిక్యూటీవ్ కమిటీల్లో సర్కార్ ప్రతినిధులు ఉండటంతో, ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదని భావిస్తోంది.

రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీల పరిధిలో 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 3,152 సీట్లు ఉన్నాయి. కానీ కొత్తగా ఈ ఏడాది సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీయూ అధికారులు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. ఇందులో ఆరు కోర్సులకు సర్కార్ అనుమతి ఇవ్వగా, వాటిలో 320 సీట్లు ఉండనున్నాయి. వీటితో పాటు ఓయూలో రెండు కొత్త కోర్సులు రానుండటంతో ఇంకో 120 సీట్లు, ఈడబ్ల్యూఎస్​కోటా కింద మరో 350 సీట్ల వరకు పెరిగే చాన్స్ ఉంది. ఈ లెక్కన సర్కార్ కాలేజీల్లో ఈ ఏడాది దాదాపు 4 వేల సీట్లుండే అవకాశముంది. ఇవన్నీ కూడా కన్వీనర్ కోటా ద్వారానే భర్తీ చేస్తారు.

ప్రస్తుతం సర్కార్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు రూ.18 వేల ట్యూషన్ ఫీజు ఉంది. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండి, ఎంసెట్ లో 10 వేల లోపు ర్యాంకు సాధించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్లందరికీ సర్కారే ఫీజు చెల్లిస్తోంది. ఈ ట్యూషన్ ఫీజును పెంచాలని యూనివర్సిటీలు కొంతకాలంగా భావిస్తున్నప్పటికీ, అది అమలుకు నోచుకోలేదు.

ఇప్పుడు వర్సిటీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ట్యూషన్ ఫీజు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల స్టూడెంట్లపై పెద్దగా భారం పడబోదని, ఫీజు సర్కారే చెల్లిస్తుండడంతో ఇబ్బంది ఉండదని అంటున్నారు. సర్కార్ కాలేజీల్లో సీట్లు పొందే స్టూడెంట్లంతా దాదాపు10 వేల లోపు ర్యాంక్ వారే ఉంటారని, ఎవరైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నోళ్లు ఉంటే, వారిపైనే భారం పడుతుందన్నారు. ప్రస్తుతం స్టూడెంట్ల నుంచి వచ్చే ట్యూషన్ ఫీజులతోనే కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలిస్తున్నామని ఓ యూనివర్సిటీ అధికారి చెప్పారు. ట్యూషన్ ఫీజు పెరిగితే జేఎన్టీయూహెచ్ కు ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •