వార్తలు (News)

వరలక్ష్మీ వ్రత విధానం??

శ్రావణ మాసం అనగానే ఆడవారికి గుర్తొచ్చేది ముఖ్యంగా వరలక్ష్మీదేవి వ్రతం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే విశేష పుణ్యాలు కలుగుతాయని, సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లుతామని స్త్రీలు ఈ వ్రతం చేయడానికి ఇష్టపడతారు.

వరలక్ష్మీ వ్రత విధానం:

దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. అలాంటి విశిష్టత కలిగిన వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పున్నమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. ఆ రోజున ఉదయమే లేచి అభ్యంగన స్నానం ఆచరించిన అనంతరం ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడలో అలకాలి. తర్వాత అక్కడ ముగ్గులు పెట్టి. మండపాన్ని తయారు చేయాలి. ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా అలంకరించి ఆ బియ్యం మీద కలశాన్ని ఉంచాలి. వీలైలే మామిడి, మర్రి, మేడి, జువ్వి, రావి ఆకుల్లో ఏదైనా ఒకటి అందులో వేయాలి. కలశంపై కొబ్బరి కాయ పెట్టి జాకెట్ ముక్కను దానికి చుట్టాలి.

శ్రీ వరలక్ష్మీ వ్రతం చేయడానికి కావలసిన పూజ సామగ్రి:

పసుపు – 100 గ్రాములు
కుంకుమ-100 గ్రాములు
గంధం- 1 డబ్బా చిన్నది
జాకెట్ గుడ్డలు- 2
పూల మాలలు-6
విడిపూలు- అరకిలో
తమలపాకులు- 30
వక్కలు- 100 గ్రాములు
ఖర్జూరములు-50 గ్రాములు
కలశము – ఒకటి
కొబ్బరి కాయలు – మూడు
అగర్బత్తి – ఒక ప్యాకెట్
కర్పూరము-50 గ్రాములు
చిల్లర పైసలు – ముప్పయి రూపాయి బిళ్లలు
తెల్ల టవల్-1
మామిడి ఆకులు- తగినన్ని
అరటిపండ్లు – 1 డజను
ఇతర రకాల పండ్లు – ఐదు
అమ్మవారి ఫోటో- ఒకటి
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం
తియ్యని ప్రసాదాలు, వీలైతే రెండు రకాలు
బియ్యం – రెండు కిలోలు
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 మి.లీ
దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్స్, ట్రేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, గిన్నెలు.

ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేసి వరలక్ష్మీని కీర్తిస్తూ ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్టోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అష్టోత్తర శతనామాల్లో 108 కథలు ఉంటాయి. బ్రహ్మవైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి కంకణాలను తయారు చేసి అమ్మవారికి అర్చించిన అనంతరం దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇంటి సభ్యులందరికీ కంకణాలను కట్టాలి. భక్తితో నమస్కారాలు చేసి ఇంటికి ముత్తయిదువులను పిలిచి వాళ్లకు వాయినాలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో వరలక్ష్మీ వ్రతం పూర్తవుతుంది.

చాలామందికి వ్రతవిధానం తెలియకనో లేక వ్రతం చేసేవారు లేకనో , తమకు తోచిన విధంగా మమా అనిపిస్తారు. ఇక్కడ వివరించిన విధానంలో వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మా ఆకాంక్ష!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    24
    Shares
  • 24
  •  
  •  
  •  
  •