వార్తలు (News)

నీరాకకోసం ఎదురుచూస్తు. ఇట్లు నీ అమ్మకాని అమ్మ తెలుగు తల్లి

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్  10/11
(౧౭౯౮ – ౧‍౮౮౪)
( 1798 – 1884)
భారత దేశ చరిత్రలో ఆంగ్లపాలనా కాలం అనటం కంటే ఆంగ్లపాలకుల దోపిడీ కాలం అనటం సమంజసంగా వుంటుంది. మరుభూములలో మంచినీటి బావులవలె కొందరు ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని నాగరికతను అర్థం చేసుకొని మనకు మహోపకారం చేశారు. వారిలో తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు చిరస్మరణీయులు నలుగురు.
ఆనాడు దత్తమండలాలుగా పేరుగాంచిన రాయలసీమ జిల్లాల మొదటి కలెక్టరుగా, యీ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పి, పాళెగాళ్ల అరాచకాలను అణచివేసి, ‘మండ్రోలయ్య’ గా ప్రజల మన్ననలందుకున్న వాడు సర్ థామస్ మన్రో.
మన దేశ చరిత్రకు కావలసిన ముడి సరుకును కైఫియత్తుల రూపంలో అందించిన మహనీయుడు కల్నల్ కాలిన్స్ మెకెంజీ.
అపారమైన గోదావరీ జలాలకు అడ్డంగా ఆనకట్ట నిర్మింపజేసి తెలుగు ప్రజలకు అన్నదాతగా విఖ్యాతుడైనవాడు సర్ ఆర్థర్ కాటన్.
మినుకు మినుకు మంటున్న తెలుగు వాజ్మయదీపాన్ని స్నేహసిక్తం చేసి ప్రజ్వలింప చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్.

ఈ నలుగురు కారుమేఘాల్లో మెరుపుల్లాంటి మహనీయులు.
వారిలో తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన,తొలి తెలుగు శబ్దకోశమును పరిష్కరించి ప్రచురించిన,వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేసిన, ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన, .మహానుభావుడు,సి.పి.బ్రౌన్ గా పిలువబడు శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ౨౨ ౩ ( 223) వ పుట్టినరోజు ఈనెల ౧౦(10)వతేదీ,అనగా ౧౦‍- ౧౧ -౨౦౨౦(10- 11- 2020) మంగళవారము. ఆసందర్భముగా ఆమహనీయుని గూర్చి ఒక విరివి

శ్రీ సి. పి. బ్రౌన్ ౧౭౯౮(1798) నవంబర్ ౧౦(10)న కలకత్తాలో జన్మించారు.ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది.ఇండియాలో, ఈస్టిండియా కంపెనీ ఉద్యోగానికి మొదటి మెట్టుగా బ్రౌన్ ను లండన్ (హెర్ట్‌ఫర్డ్) లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ‘బంగారు పతకాలు’ యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ “తత్ సుఖ సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం” అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు ‘శ్రీవిద్యా వరాహ’ అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, హిందూస్థానీ భాష నేర్చుకున్నారు. కంపెనీ ప్రభుత్వం బ్రౌన్ ని మద్రాసు సర్వీసుకు ఎంపిక చేసింది. ౧౮౧౭(1817) ఆగష్టు ౪(4) న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు.

అప్పటికి ప్రపంచంలో తెలుగు భాష ఒకటి వుంది, అనేది కూడా వారికి తెలియదు. అప్పటివారి వయసు పందొమ్మిదేళ్ళు. ఫోర్ట్‌సెంట్ జార్జి కాలేజీలో శిక్షణ కోసం చేరారు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నారు. పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

౧౮౨౦(1820)లో సర్ థామస్ మన్రో మద్రాసు గవర్నరుగా చేరారు. కంపెనీ ఉద్యోగులందరూ దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించాలనీ, ప్రజల భాషలోనే ప్రభుత్వ వ్యవహారాలను సాగించాలని ఆదేశించారు. మన్రో తన ‘కాన్వొకేషన్’ ఉపన్యాసంలో చేసిన ప్రబోధం బ్రౌన్ మనసులో మంత్రోపదేశంగా నాటుకొన్నది.

౧౮౨౦(1820) ఆగస్టులో బ్రౌన్ కడపలో ఉద్యోగజీవితం ప్రారంభించారు. కడప కలెక్టరుకు అసిస్టెంటుగా వుండేవారు. అప్పటి కలెక్టరు హన్‌బరి తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారు. అయనలాగా మాట్లాడాలనినిశ్చయించుకున్నారు బ్రౌన్. (౧౮౨౦ ‍‍- ౨౨) (1820 ‍- 22) చివరి వరకు కడపలో పనిచేశారు. కొంతకాలం మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి మున్నగు చోట్ల పనిచేశారు.(౧౮౨౬ – ౨౯) (1826-29) మధ్య కడపలో మరోసారి ఉద్యోగం చేశారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు.తెలుగు నేర్పే పండితులకు ఇంగ్లీషుబొత్తిగాతెలియనిరోజులవి.తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకైపురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓనిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది.

౧౮౨౬(1826)లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొని, అక్కడ పెద్ద బంగళా, తోట కొని,బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పి,తెలుగు సాహిత్యానికి ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పారు. సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు. అప్పట్లో వారి వేతనం ౫(5)‍- ౬(6) వందలకు మించదు. కడపలోని బంగళా, తోట వ్యవహారాలన్నింటినీ బ్రౌన్‌కు అత్యంత విశ్వాస పాత్రుడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి చూచుకొనేవాడు. బ్రౌన్ ఎక్కడ పనిచేస్తున్నా కడపలోని బంగళా, తోట, గ్రంథ పరిష్కరణ, గ్రంథ సేకరణ మున్నగు విషయాలను అయోధ్యపురం కృష్ణారెడ్డి ద్వారా జాబుల మూలంగా తెలుసుకొనేవారు.

అవిద్య అకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. ౧౮౨౧(1821)లో కడపలో రెండు బళ్ళు పెట్టారు.మచిలీపట్నంలో కూడారెండుపాఠశాలలనుప్రారంభించారు .ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించారు. ఆబళ్ళలోదేశీయఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.దానధర్మాలు విరివిగా చేసేవారు. వికలాంగులకు సాయం చేసేవారు..

‌ఈ విషయం సి.పి. బ్రౌన్ తన స్వీయచరిత్రలో ఈ విధంగా వ్రాసుకున్నారు -“నేనెక్కడ పనిచేసినా, బాలురకు తెలుగు, హిందూస్థానీ విద్యాభ్యాసము నిమిత్తము ఉచిత పాఠశాలలనునెలకొల్పేవాడను. ఆయా ప్రాంతము వారినే ఉపాధ్యాయులుగా నియమించేవాడను. ౧౮౨౧(1821)లో కడపలో రెండింటిని, ౧౮౨౩(1823)లో బందరులో రెండింటిని స్థాపించేను.౧౮౪4(1844)లో మదరాసులో ఒక ఉచిత పాఠశాల పెట్టేను. అందులో ౮౦(80) మంది తెలుగు, తమిళ విద్యార్ధులుండేవారు. ఇది ఏడేండ్లనడచినది.కానీ దానయాజమాన్యము మరొకరికి అప్పగించేను. కాని అది సరిగా నడవలేదు. తరువాత క్రైస్తవ మిషనరీలకు దాన్ని అప్పగించేను.”

న్యాయస్థానాలలో తెలుగులో కోర్టుతీర్పులకు ఆయనే ఆధ్యులు.తెలుగుదేశాన్ని ముఖ్యంగా రాయలసీమను కృంగదీసిన కరువులెన్నో వచ్చాయి. వాటిలో ధాత కరువు (౧౮౭౬-౭౭)(1876-77) అంతకు ముందు వచ్చిన నందన కరువు(౧౮౩౨-౩౩(1832-33)మహాఘోరమైనవి. నందన కరువునే ’గుంటూరు కరువు’గా చరిత్రకారులు చిత్రించారు. కరువు పరిస్థితులను గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన జాబులోని పదజాలం ప్రభుత్వానికి నచ్చలేదు. కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నారు బ్రౌన్‍ను ప్రభుత్వం మందలించింది. కరువు కాలంలో గుంటూరు జిల్లాలో ఎన్నో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రజలను ఆదుకొన్నారు.ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. 

ప్రతి పైసాను కూడబెట్టి తన కింద పనిచేసే పండితులకు నెలనెలా జీతాలిచ్చేవారు. ఆర్థికంగా కటకటలాడుతున్నా పుస్తకాల సేకరణ, ప్రచురణ పథకాలను నెలనెలా వందలు ఖర్చు చేసేవారు. చివరికి ‍౬౦(60)వేల రూపాయలు అప్పులు చేశారు. ఇందులో సగం వడ్డీ- ఇదంతా తెలుగు భాషోద్ధరణ కోసమే. చివరి దశలో అప్పులన్నీ తీర్చారు.

బ్రౌన్ మానవతావాది. ప్రతి నెలా ౧౦౦(100) ‍- ౧౩౦(130) మంది గుడ్డి, కుంటి వారికి సాయం చేసేవారు. అప్పులు చేసి జైలుపాలైన పదకొండు మందికి ౩౫౫(355)రూపాయలిచ్చివిడిపించారు. ఒక దశలో నెలకుసగటున౫౦౦(500) రూపాయలు దానధర్మాలకు ఖర్చు చేసేవారు. కడపలో జరగనున్న సహగమనాన్ని ఆపు చేయించారు.

౧౮౩౪(1834)లో ఆయన ప్రభుత్వోద్యోగం నుంచి విడుదలై లండన్ కు వెళ్ళిపోయి ౧౮౩౫(1835) నుంచి ౧౮౩౮(1838) వరకు అక్కడే ఉన్నారు. ౧౮౩౮(1838)లో ఈస్టిండియా కంపెనీకి పర్షియన్అనువాదకుడుగా బ్రౌన్ తిరిగి మద్రాసుకు చేరుకున్నారు. మద్రాసు కాలేజి బోర్డు సభ్యుడుగా కూడా సేవలందించి ౧౮౫౪(1854)లో అనారోగ్యం వల్ల ఉద్యోగ విరమణ చేసి, లండన్ కు వెళ్ళిపోయారు.౧౮౬౫(1865)లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితులై కొంతకాలం పనిచేశారు. ఆయన ౧౮౮౪(1884) డిసెంబర్ ౧౨(12)నలండన్లో ఎనభై ఏడవ ఏట అవివాహితునిగానే కన్నుమూశారు.

పండితుల సాన్నిహిత్యం
తాతాచారి
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలంనెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. ౧౮౪౮(1848)లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నారు.. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి ౨౪(24) కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి ౧౮౮౫(1855)లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని ‘పాపులర్ తెలుగు టేల్స్’ అనే పేరుతో ప్రచురించారు. ౧౯౧౬(1916)లో ‘తాతాచారి కథలు ‘ గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. ౧౯౫౧(1951)లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, ౧౯౭౪(1974)లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవారు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.
ఏనుగుల వీరస్వామయ్య
సి.పి.బ్రౌన్‌కుతెలుగులోతొలియాత్రాచరిత్రకారుడు , పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్‌కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి,చేసినపనులువంటివిపంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్‌కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించినవివరాలుతెలిపి,వీటినిప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రనుప్రచురించగలరేమోపరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు.

తెలుగు భాషకు చేసిన సేవ

పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించారు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. ౧౮౨౫(1825) నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను ౩౦(30) ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు.

సి.పి. బ్రౌన్ చేసిన తెలుగు భాషా సేవ వారి మాటల్లోనే:

“తెలుగు దేశానికి రాజధానియైన బందరు (మచిలీపట్టణము)లో నేను మూడు సంవత్సరములు న్యాయాధిపతిగా వ్యవహరించేను. అక్కడ నేను సంస్కృతాంధ్ర గ్రంథముల వ్రాతప్రతులు చాలా సంపాదించేను. వాని సంపాదన నాకొక “పిచ్చిగా” పరిణమించిందంటే అతిశయోక్తికాదు. అక్కడ నేను ఒక దమ్మిడీ నిలవచేయలేదు. నా వద్ద ఎప్పడూ ఇరవై మంది బ్రాహ్మణులు, శూద్రులు వీటి గురించి పనిచేసేవారు. వారికందరకు జీతము లేర్పాటు చేసెను. ప్రాచీన కావ్యాలు కాగితాల మీద వ్రాయడము, సప్రమాణికములైన పాఠములతో వానిని సంస్కరించడము, పదాను క్రమణికలు తయారుచేడము, వ్యాఖ్యానాలు వ్రాయడము వారి పని.”

(౧౮౩౫- ౩౮)(1835- ౩8) మధ్య సెలవు పై లండన్ వెళ్ళారు. అక్కడ కూడా విశ్రాంతిలేకుండా తెలుగు భాష కొరకు శ్రమించారు. ‘ఇండియ హౌస్ లైబ్రరి’లో గుట్టలుగా పడివుండిన దక్షిణ భారత భాషల గ్రంథాలు (లిఖితప్రతులు)౨౧౦౬(2106) ను మద్రాసు గ్రంథాలయానికి పంపారు. తిరిగి వచ్చిన తరువాత వసుచరిత్ర- మనుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించారు. కళాపూర్ణోదయం, పల్నాటి వీర చరిత్ర మున్నగు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశారు. సంస్కృత గ్రంథాల సేకరణ, పరిష్కరణ చేశారు.

ఇదంతా పండిత భాషకు సంబంధించిన కృషి. ప్రజా భాషకు మరింత ఎక్కువ కృషి చేశారు. ప్రజల నోళ్ళలో నానుతూ వచ్చిన చాటువులను, సామెతలను, కథలు, గాథలు, పలుకుబడులను సేకరించారు. అన్నిటి కన్నా మిన్నగా చెప్పవలసిన పని, నిఘంటువు నిర్మాణం. తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీష్ తెనుగు నిఘంటువులు వ్రాశారు. ఈనాటికీ అవి ప్రామాణికంగా వున్నాయి. జిల్లా నిఘంటువు వ్రాశారు. తెలుగు సాహిత్యం గురించి శిల్పము, జ్యోతిష్యము,కలిశకం,హిజరి,మున్నగు వాటిపైపెక్కువ్యాసాలువ్రాశారు.రాజులయుద్ధము అను అనంతపురం చరిత్ర తాతాచారి కథలు, పంచతంత్ర కథలు యిలా ఎన్నో రచనలు చేశారు.

౧౮౨౭(1827) నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’.౧౮౨౪(1824)లో అబేదుబాయ్ వ్రాసిన”హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్” పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది . వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగువ్యాకరణ,ఛందస్సూత్రాలునేర్చుకొన్నాడు బ్రౌన్.దాదాపు ౨(2)వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు.అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విసృత ప్రచారం కావించారు. మరో పదేళ్ల తర్వాత,౧౧౬౪ (1164 )పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు .. .. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ – ప్రచురణల ముద్రింపచేసారు.

౧౮౨౫(1825)లో రాజమండ్రికి బదిలీ అయి ఆంధ్ర మహాభారతంచదవసాగారు.అప్పకవీయం, కవిజనాశ్రయంమున్నగువాటినిజీర్ణించుకున్నారు. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ముమ్మరంగా సాగించారు. అగ్గి పురుగులకు ఆహుతి కానున్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించారు. కొంత డబ్బుతో పండితులను, వ్రాయసగాళ్ళను పెట్టి కావ్య పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయించారు. ఆంధ్ర మహాభారతాన్ని, భాగవతాన్ని పరిష్కరింప చేసి అచ్చు వేయించినవారు బ్రౌన్.

౧౮౪౧(1841)లో “నలచరిత్ర”ను ప్రచురించారు. “హరిశ్చంద్రుని కష్టాలు”గౌరనమంత్రిచేవ్యాఖ్యానం వ్రాయించి ౧౮౪౨(1842)లో ప్రచురించారు.౧౮౪౪(1844)లో “వసుచరిత్”‘,౧౮౫౧(1851) లో “మనుచరిత్ర” ప్రచురించారు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించారు.౧౮౫౨(1852)లో “పలనాటి వీరచరిత్ర” ప్రచురించారు.

.ముద్రణకు అనువుగా వుండటానికి వీలుగా తెలుగు లిపిని సంస్కరించారు. ‘అరసున్నాను, బండి”ఱ”ను పరిహరించి, క్రావడి {సంయుక్తాక్షరములో రెండో హల్లుగా వచ్చు రేఫము)ని మార్చారు. తెలుగు పద్యపాదాలను ‘యతి’ స్థానంలో విరచడం ఆయన ప్రారంభించిన సంప్రదాయమే. బ్రౌన్ దొరకు యావత్ తెలుగు జాతి రుణపడివుంది.
రచనలు
ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు ‍౧౮౨౭(1827).
లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం
రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
తెలుగు-ఇంగ్లీషు ౧౮౫౨(1852), ఇంగ్లీషు-తెలుగు ౧౮౫౪(1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)
తెలుగు వ్యాకరణము ‍- ౧౮౪౦(1840)లో ప్రచురణ
వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం
బ్రౌన్‌కు ఆనాటి పండితులు, యితరులు వ్రాసిన జాబుల సంపుటాలు ౨౦(20)కి పైగా వున్నాయి. ఇవన్నీ మద్రాసు ఓరియంటల్ మేనుస్క్రిప్టు లైబ్రరీలో వున్నాయి. వీటిలో విలువైన చారిత్రక విషయాలున్నాయి.
తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసారు.
ఇతరుల ప్రశంసలు
ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపచేసిన బ్రౌన్ దొర సేవను ప్రశంసిస్తూ, నాటి పండితుడు అద్వైత బ్రహ్మశాస్త్రి యిలా అన్నారు.
: “సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ యే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి… తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి”
ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : “నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్”
బంగోరె: “ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు”
“సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు” – కొమర్రాజు లక్ష్మణరావు
“ఆంధ్రభాషోద్దారకులలో కలకాలముస్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను” – వేటూరి ప్రభాకరశాస్త్రి
స్మృతి చిహ్నం
ఆంధ్ర భాషోద్ధరణ కోసం జీవితం అంకితం చేసిన బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో ఆయననివసించి సాహిత్య యజ్ఞం చేసిన స్థలంలో విశాలమైన గ్రంథాలయ భవనం నిర్మింపబడింది.. బ్రౌన్ బంగళా శిథిలాలున్న స్థలాన్ని శ్రీ సి. కె. సంపత్ కుమార్ సి.పి. బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ఉచితంగా యిచ్చారు. ప్రజా విరాళంగా రు౩ -౨0( 3-20 )లక్షలు, ప్రభుత్వం నుండి రు.౪- ౫0(4-50) లక్షలు ఖర్చు చేసినిర్మించారు. శ్రీ పోలేపల్లివెంగన్నశ్రేష్టితమసొంతగ్రంథాలయంలోని మూడువేల పుస్తకాలు. డా. పుట్టపర్తి వారు వంద విలువైన పుస్తకాలు యీ గ్రంథాలయానికి యిచ్చారు. ఈ గ్రంథాలయానికి ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వబడుతుంది. తి.తి.దేవస్థానం, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం,శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం, ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ, డా. బెజవాడ గోపాలరెడ్డి, డా.కె. జగ్గయ్య మున్నగువారు పెక్కు గ్రంథాలను ఇచ్చారు. .2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.
బ్రౌన్ మహనీయుని సమాధి పునరుద్ధరణ‌
౨౦౦౯(2009) ఏప్రిల్ ౨౬ (26)వ తేది తెలుగువారికి మరపురాని రోజు.ఆ రోజున‌ లండన్లోని కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో ఉన్న సి.పి. బ్రౌన్ సమాధిని , లండన్ రావలసిందిగా యు.కె.లోని తెలుగు వైద్యబృందం పంపిన ఆహ్వానం పురస్కరించుకుని లండన్ వెళ్ళిన శ్రీయుతులు బుద్ధప్రసాద్,యార్లగడ్డలక్ష్మీప్రసాద్ గార్లు లక్షల సంఖ్యలో వున్న సమాధులలో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సమాధిని ౩(3) గంటల సమయం అన్వేషించి, కనుగొని,ఆ సమాధి వున్న దుస్థితి మూలంగా కలిగిన వేదనతో , ఆవిషయము , ఆతిథ్యమిచ్చినడా.గోవర్ధన్రెడ్డిగారికి,డా.రాములుదాసోజుగారికి చెప్పారు.వారి ప్రోద్భలముతో లండన్ తెలుగుసంఘం వారురెండులక్షలఖర్చుతో బ్రౌన్ మ‌హనీయుని సమాధి పునరుద్ధరించి, ఉడతాభక్తిగా ,తెలుగుజాతితరపున కృతజ్ఞత చాటారు.
ఆంగ్లేయుడైనప్పటికి, ఏ తెలుగువాడు కూడా చేయనటువంటి అనన్య,నిస్వార్థ సేవను తెలుగుభాషామతల్లికి చేసి,కొన ఊపిరితోనున్న తెలుగునుడికి,తిరిగిజీవంపోసి చైతన్యము కలిగించినతెలుగుసూర్యుడు బ్రౌన్ మహాశయుని విస్మరిస్తే,తెలుగుజాతి కృతఘ్నజాతిగామిగిలిపోక తప్పదు.
తెలుగుభాషామతల్లికి,బ్రౌన్ మహనీయుడు చేసిన నిస్వార్థ సేవను గుర్తు చేసుకుంటు, వారి౨౨౩ (223)వ‌ పుట్టిన‌ రోజు సందర్భముగా నిండుమనసుతో కృతజ్ఞతానివాళులర్పిద్దాం.
ఓం శాంతి శాంతి శాంతిః

.తెలుగు తల్లి ఆవేదన
నాయనా,బ్రౌన్! నువ్వుతెలుగేతరుడువయిన,అందులో విదేశీయుడువయిన ,కొనిఊపిరితో నున్న నన్ను చేరదీసి,వూపిరి పోసి,జవసత్వాలిచ్చి కన్నతల్లిని సాకినట్లు సాకి,నీ తోబుట్టువులులాంటి నా బిడ్ఢలకు”అమ్మను జాగ్రత్తగా చూసుకోమని అప్పజెప్పి వెళ్ళావు.బంగారంలాంటి నా బిడ్డలు నువ్వుకోరినట్లుగానే ,కొన్ని తరాలు సాకి నాకు ఎనలేని ఔన్నత్యాని కలిగించారు.కాలక్రమేణ తరాలు మారాయి.నన్ను దురదృష్టము వెంటాడింది.తమకు సమాజములో ని వ్యక్తులుగాగుర్తింపునకు తన జాతి మనుగడ ముఖ్యమని,జాతిమనుగడసభ్యతాసంస్కారాలు,ఆత్మీయత, బాంధవ్యాలు నేర్పే జాతి భాషాసంస్కృతుల వికాసము మీద ఆధారపడి వుంటాయని తెలియని అజ్ఞానం లో కొట్టుమిట్లాడుతున్నబిడ్డలుతయారయ్యారు.తమ జాతి మనుగడ గురించి పట్టని వీరు,విపరీత స్వార్థం,ధనాశ కలిగి,తమఎదుగుదలకు మరమనుషులను తయారుచేస్తున్న పరభాషాచదువులు తప్ప, అమ్మభాష లో చదువులు తమఎదుగుదలకు అడ్డంకిగా త లచి , అమ్మభాషను చులకనచేస్తు , నిర్వీర్యంచేస్తున్నమూర్ఖులు. తమ భాషా సంస్కృతు ల గురించి ఏమాత్రము అవగాహన లేనిమూర్ఖులు, తమస్వార్థంకొరకు చిన్నారుల ను బలిపశువులను చేస్తున్నారు.తద్వారా నాఊపిరి తీయడానికి శాయశక్తుల కృషిచేస్తున్న ఈరాక్షసులునుండినాకురక్షణకరవయినది .నాఈరోదనఅరణ్యరోదనగా మిగిలింది.
బిడ్డా!నాకు అప్పుడు నీవు వూపిరి పోసి తప్పు చేసావు.అప్పుడే నామనుగడ ముగిసివుంటే, నాకీదుస్థితి తప్పేది.తెలుగుజాతేకనుమరుగయ్యే ది.
అయ్యో బిడ్డా!అలా దిగాలుపడకు.నాఆవేదన నీతో పంచుకున్నతరువాత, నాబిడ్డలలో కొందరు రాక్షసులయిన,అందరు కాదని,విధి ఎల్లవేళలా ఒకలావుండదని.చెడు తాత్కాలికమని,నువ్వు నాబిడ్డగా వచ్చి మరలననుసాకుతావని,మరల నావైభోగము చిగురిస్తుందని ఆశాకిరణం గోచరిస్తోంది.
నీరాకకోసం ఎదురుచూస్తు.
ఇట్లు
నీ అమ్మకాని అమ్మ
తెలుగు తల్లి

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.