ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్ సంధు సాధించారు. 2000వ సంవత్సరంలో భారత్ నుంచి లారాదత్తా ‘మిస్ యూనివర్స్’గా ఎంపికైన అనంతరం మళ్ళీ 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ టైటిల్‌ను పంజాబ్ యువతి హర్నాజ్ సంధు గెలుచుకోవడంతో మాజీ మిస్ యూనివర్స్ ఆండ్రియా మెజా (మెక్సికో), హర్నాజ్‌కు కిరీటాన్ని అలంకరించారు.

ఈ టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం హర్నాజ్ మాట్లాడుతూ ”నాకు మార్గదర్శకంగా, మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, దేవుడికి, మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు నేను కృతజ్ఞురాలిగా ఉంటా. నా కోసం ప్రార్థించిన వారందరికీ నా ప్రేమపూర్వక ధన్యవాదాలు. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని భారత్‌కు తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది” అని హర్నాజ్ భావోద్వేగం చెందారు.

పంజాబ్‌కు చెందిన హర్నాజ్ మోడలింగ్‌తో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. 17 ఏళ్ల వయస్సు నుంచే ఆమె అందాల పోటీల్లో పాల్గొంటుండగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ‘మిస్ దివా- 2021’ టైటిల్‌ను గెలుచుకున్నారు. 2019లో ‘ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్’ టైటిల్‌ను అందుకున్నారు. ఆ ఏడాది మిస్ ఇండియా పోటీల్లో టాప్-12లో చోటు దక్కించుకున్నారు. అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా, ఆమె ఇప్పటివరకు రెండు పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.