ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నవనిర్మాణ నగర్‌లోని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణ, మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీసుస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్‌ వీడియోగ్రాఫర్‌ ఎన్‌.రమేష్‌, ఏబీఎన్‌ రిపోర్టింగ్‌ ఏజెంట్‌ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొంటూ ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారికి ఈ కేసును బదలాయించేందుకు వీలుగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ఈ నెల 10న ఘటన జరిగిన నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఫిర్యాదు అందగా దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని వివరించారు.