సంక్రాంతి పండగ అంటేనే బంధువులందరి కూడిక. ఆనందకర వేడుక. సొంత ఊరు వదిలి వేరు వేరు ప్రదేశాలలో ఉద్యోగాలు చేసుకునే వారు అందరూ ఈ పండుగను సొంత ఊరికి చేరుకొని బంధువులందరితో కలిసి జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకమైనది. ఇతర రాష్ట్రాల్లో సైతం వేరే పేర్లతో ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. వస్తూ వస్తూ ఆన్నదాతల కళ్లల్లో ఆనందాలను తీసుకొస్తుంది ఈ పండగ. అయితే ఈ పండగను మూడు రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈ మూడు రోజుల్లో ఏమేమీ చేస్తారో తెలుసా.. ?

ఈ ఏడాది 14న భోగి పండగను జరుపుకుంటే.. 15 వ తేదీన (శనివారం) సంక్రాంతి పండగను జరుపుకుంటాం. ఇక 16 వ తేదీన కనుమ పండగ అంటే లాస్ట్ అదే పండుగకు చివరి రోజు. ఈ మూడు రోజులు దేవుళ్ల పూజలు నిర్వహిస్తూ కలకాలం మమల్ని సుఖ సంతోషాలతో ఉండేలా చూడు స్వామీ అంటూ ప్రజలు పూజలు చేస్తారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే మరక సంక్రాంతి ఏం తెలియజేస్తుందంటే.. అందరితో సరదాగా గడపడం, ఆడుతూ, పాడుగూ కాలక్షేపం చేయడం, అలాగే నోరూరించే స్వీట్లు, వేరు శనగలను తింటూ.. అందరూ ఒకే చోట సమావేశమయ్యి సమయాన్ని గడపడాన్ని సూచిస్తుంది. ఈ రోజు చాలా మంది దాన ధర్మాలు కూడా చేస్తారు.

మకర సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండగ వస్తుంది. ఈ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి భోగి మంటలను వేస్తారు. ఆ మంటల్లో ఇంట్లో ఉండే పాత వస్తువులను, ఆవుల పిడకలను వేస్తారు. అలాగే చిన్నపిల్లలపై భోగి పళ్లను కూడా జల్లుతారు. అయితే పురాణాల ప్రకారం దేవతలు శ్రీమహా విష్ణువును చిన్నారిగా భావించి రేగు పళ్లతో అభిషేకం చేశారట. అందుకే చిన్నపిల్లలపై రేగుపళ్లను పోస్తారు.

మకర సంక్రాంతి రెండో రోజు సూర్యుడు మరక రాశిలోకి వెళతాడు. దక్షిణయానం నుంచి ఉత్తరయాణంలోకి సూర్యుడు ప్రవేశించడంతో పుణ్యకాలం ప్రారంభమవుతుందని శాస్త్రం చెబుతోంది. మూడో రోజు కనుమ పండగ వస్తుంది. ఆ రోజు ఇష్టంగా సాకుతున్న గోవులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. అయితే ఈ రోజున కొత్తగా పెళ్లైన యువతులు సావిత్రి గౌరీ వ్రతం, సౌభాగ్య వ్రతం చేస్తారు. ఎందుకంటే కలకాలం సౌభాగ్యంగా ఉండాలని ఈ పూజలు చేస్తారు. ఇకపోతే పిత్రు దేవతల ఆత్మ శాంతించాలని చాలా మంది సంక్రాంతి రోజున దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. వారి వారి సామర్థ్యం మేరకు ఈ దానాలను చేస్తుంటారు.