పట్నా నుంచి గౌహతి వెళుతున్న గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర బెంగాల్‌లోని మైనాగురి – దోమోహని సమీపంలోకి రాగానే 12 బోగీలు పట్టాలు తప్పగా వాటిలో ఆరు బోగీలు తలకిందులై తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన చాలాసేపటి వరకు బోగీ కిటికీల నుంచి ఒకొక్కరుగా కిందకు దూకుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ రైలు ప్రమాదం కారణంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఘటనాస్థలిని సందర్శించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే ‘దీనిపై సమగ్ర విచారణ మొదలైంది. ప్రధాని మోదీ ఘటనను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఆయనతో టచ్ లోనే ఉన్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ప్రాథమిక విచారణలో లోకోమోటివ్ ఎక్విప్మెంట్ లో లోపాలున్నట్లు తెలిసింది. రైల్వే సేఫ్టీ కమిషన్ ఎంక్వైరీ నిర్వహిస్తుంది. ఘటన వెనుక కారణాలను తప్పక తెలుసుకుంటుంది’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా నిధుల పంపిణీ మొదలైంది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వనుండగా క్షతగాత్రుల కుటుంబాలకు రూ.1లక్ష ఇస్తున్నారు. ప్రమాదరహిత గాయాలకు గురైన వారికి రూ.25వేలు అందజేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు.