చైనాలోని వూహాన్ నగరంలో 2019 డిసెంబరులో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి ఈ వైరస్ పాకింది.

13 ఫిబ్రవరి 2021నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 108.82 మిలియన్లకు దాటిపోయాయి. మరణాలు కూడా 23.96 లక్షలకుపైనే పెరిగిపోయాయి. 

శుభవార్త ఏమిటంటే.. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

భారత ప్రభుత్వం కూడా 2020 జనవరి 16 నుంచి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వ్యాక్సీన్ల కోసం ప్రజలు రిజిస్టర్ చేయించుకునేందుకు కోవిన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను కూడా సిద్ధంచేసింది.

ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, దిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో వ్యాక్సీన్లను ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల అనంతరం ప్రైవేటు వైద్యులకు రెండో డోసు టీకాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.

దీంతో అసలు కోవిడ్-19 వ్యాక్సీన్ ధర ఎంత ఉంటుంది? వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని డోసుల వ్యాక్సీన్ అవసరం అవుతుంది? తదితర ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి.

మొదలైన ఆక్స్‌ఫర్డ్ టీకా పంపిణీ

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మాసంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశాయి. దీనికి కోవిషీల్డ్‌గా నామకరణం చేశారు. దీన్ని భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది.

డిసెంబరు 30న ఈ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. జనవరి 3న భారత్‌ కూడా ఈ టీకా వినియోగానికి అనుమతిని ఇచ్చింది.

70 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు చెబుతున్నాయి. దీన్ని తీసుకున్నవారిలో శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలు కనిపిస్తున్నట్లు డేటా చెబుతోంది.

వంద మిలియన్ డోసులకు ఆర్డర్

  • ఈ టీకాను తీసుకోవడం ద్వారా 90 శాతం వరకు వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
  • 100 మిలియన్ డోసులు తమకు అందించాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం.. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ ద్వయాన్ని అభ్యర్థించింది. 
  • ఈ టీకాను రెండు డోసుల్లో ఇస్తారు.
  • మరోవైపు 20,000 మంది వాలంటీర్లపై ఈ టీకా పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

లాటిన్ అమెరికాలో ఈ వ్యాక్సీన్ డోసు నాలుగు డాలర్ల కంటే తక్కువ ధరకే విక్రయిస్తామని గతేడాది మెక్సికోలో ఆస్ట్రాజెనెకా సంస్థ అధిపతి తెలిపారు

ఈ వ్యాక్సీన్‌ను భారత్‌లో భారీ స్థాయిలో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తోంది. దీని ధర మూడు డాలర్లు అంటే 220 రూపాయల వరకూ ఉంటుందని సంస్థ తెలిపింది.

అదే సమయంలో ఐరోపాలో ఈ వ్యాక్సీన్ ధర 2.5 యూరోల వరకూ ఉండొచ్చని ఇటలీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆస్ట్రేలియా కూడా ఆగస్టు నెలలో వ్యాక్సీన్‌పై ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది.

దేశంలో అందరికీ ఈ వ్యాక్సీన్‌ను ఉచితంగా అందిస్తామని దేశ ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఈ వ్యాక్సీన్‌కు ఎంత ఖర్చు పెడుతుందో బయటకు తెలియడంలేదు.

బ్రిటన్‌లో ఈ వ్యాక్సీన్ ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్..

భారత్‌లోని తొలి దేశీయ వ్యాక్సీన్‌ను భారత్ బయోటెక్ తయారుచేస్తుంది. దీనికి ”కోవాగ్జిన్”గా నామకరణం చేశారు. దీనికి జనవరి 3న భారత్ ఆమోదం తెలిపింది. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే ఈ వ్యాక్సీన్‌కు ఆమోదం తెలిపారని భారత్‌లోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసరంగా కొన్ని వర్గాలకు ఇచ్చేందుకు ఈ వ్యాక్సీన్‌కు అనుమతులు ఇచ్చామని భారత ఔషధ ప్రాధికార సంస్థ చెబుతోంది. కరోనావైరస్ కొత్త రకం కూడా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో క్లినికల్ ట్రయల్ మోడ్‌లోనే వ్యాక్సీన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. అయితే, క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో వ్యాక్సీన్‌కు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలతోపాటు వైద్యులు, పరిశోధకుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం భారత్ బయోటెక్ 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్‌ను సిద్దంచేసింది. ఈ ఏడాది చివరినాటికి రెండు నగరాల్లోని తమ సదుపాయాల సాయంతో 700 మిలియన్ల డోసులను సిద్ధం చేయగలమని సంస్థ చెబుతోంది.

”పరిశోధన పూర్తికాని వ్యాక్సీన్‌కు అనుమతులు ఇవ్వడం వెనకున్న ఆంతర్యం ఏమిటో మాకు అసలు అర్థం కావడంలేదు”అని ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది.

మరోవైపు తమ వ్యాక్సీన్ 200 శాతం సురక్షితమైనదని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్ మోడ్‌లో తమకు ఇచ్చిన అనుమతులను ఆయన వెనకేసుకొని వచ్చారు.

”భారత క్లినికల్ ట్రయల్ చట్టాల ప్రకారం.. రెండో దశ ట్రయల్స్ పూర్తయ్యాక కూడా అనుమతులు ఇవ్వచ్చు. దేశంలో ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించేటప్పుడు ఇలాంటి అనుమతులు ఇస్తారు. మా వ్యాక్సీన్ క్రియాశీలంగాలేని కరోనావైరస్‌ సాయంతో తయారుచేశాం. చాలా వ్యాక్సీన్లను ఇలానే తయారుచేస్తారు. అందుకే మాకు అనుమతులు జారీ చేశారు”అని ఆయన వివరించారు.

కోతులు, ఎలుకలపై చేసిన పరిశోధనల్లో కరోనావైరస్‌పై కోవాగ్జిన్ పోరాడగలుగుతోందని తేలినట్లు ఆయన చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 26,000 మంది వాలంటీర్లలో 24,000 మందికి ఇప్పటికే టీకాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరినాటికి టీకా సామర్థ్యంపై డేటా కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

95% రక్షణ కల్పిస్తున్న ఫైజర్ వ్యాక్సీన్ 

కోవిడ్‌-19కు కళ్లెం వేసేందుకు తాము తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ 95% సామర్థ్యంతో పనిచేస్తుందని ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. బయోఎన్‌టెక్, ఫైజర్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నాయి.

గత ఏడాది జులైలో బయోఎన్‌టెక్ కంపెనీతో అమెరికా ప్రభుత్వం 1.97 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకాకు కూడా బ్రిటన్ ఆమోదముద్ర వేసింది. 40 మిలియన్ డోసులకు ఆర్డరు ఇచ్చింది.

మూడు వారాల్లో రెండు డోసుల కింత ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. ఇప్పటికే 43,000 మంది ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్నారు. వీరిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు.

ఈ వ్యాక్సీన్‌ను -70డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వీటిని ట్రాక్ చేసేందుకు ప్రత్యేక జీపీఎస్ బ్యాక్సులను కూడా తయారుచేశారు.

ఇది ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సీన్. వైరస్ జన్యు పదార్థం సాయంతో దీన్ని తయారు చేశారు.

94.5 % సామర్థ్యంతో పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్

ఫైజర్ వ్యాక్సీన్ తయారుచేసిన విధానంలోనే అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా ఒక టీకా అభివృద్ధి చేసింది. ఇది కూడా ఆర్‌ఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సీన్. ఇది 94.5 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని సంస్థ తెలిపింది.

ఈ వ్యాక్సీన్ అయితే, రెండు డోసులు తీసుకోవాలి. సామాన్యులు దీని కోసం 40 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అయితే ఇది 20 డాలర్లలోపే ఉంటుంది.

ఫైజర్ వ్యాక్సీన్ కంటే దీన్ని నిల్వ చేయడం తేలిక. దీన్ని -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేస్తే సరిపోతుంది.

తమ వ్యాక్సీన్ 33 నుంచి 37 డాలర్ల (దాదాపు రూ.2,500) మధ్యలో ఉంటుందని గత ఆగస్టులోనే మోడెర్నా వెల్లడించింది.

92 శాతం సామర్థ్యంతో రష్యా టీకా

ఈ ఏడాది ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సీన్ అద్భుతంగా పనిచేస్తోందని తెలిపింది. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఈ వ్యాక్సీన్ ఇంకా దాటుకు రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని సమర్థమంతమైన వ్యాక్సీన్‌గా చెప్పలేమని వివరిస్తున్నారు.

ఈ టీకా 92 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు డేటా చెబుతోంది.

92 శాతం సామర్థ్యంతో రష్యా టీకా

ఈ ఏడాది ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సీన్ అద్భుతంగా పనిచేస్తోందని తెలిపింది. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఈ వ్యాక్సీన్ ఇంకా దాటుకు రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని సమర్థమంతమైన వ్యాక్సీన్‌గా చెప్పలేమని వివరిస్తున్నారు.

ఈ టీకా 92 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు డేటా చెబుతోంది.

చైనా సంస్థ సినోఫార్మ్ వ్యాక్సీన్

తమ వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని చైనా ఫార్మా సంస్థ సినోఫార్మ్ ఛైర్మన్ లీయూ జింగ్‌చెన్ వెల్లడించారు. కానీ, ఈ వ్యాక్సీన్ మూడో దశ పరీక్షలు ఇంకా పూర్తికాలేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యాక్సీన్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇండోనేషియాకు కూడా దీన్ని భారీగా తరలిస్తున్నారు. 

మార్కెట్‌లో దీని రెండు డోసుల ధర వెయ్యి చైనా యువాన్‌ల(పది వేల రూపాయలు) కంటే తక్కువగానే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులకు ఈ డోసులను ఉచితంగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

చైనా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో ఈ వ్యాక్సీన్‌ను చేర్చితే.. ఖర్చంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చైనా అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వ్యాక్సీన్‌ రెండు డోసులను లీయూ తీసుకున్నారు. తనకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని ఆయన వివరించారు. 

ఈ టీకా 50.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని బ్రెజిల్‌లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. దీని సామర్థ్యంపై పరీక్షల్లో ఒక్కో దేశంలో ఒక్కోలా ఫలితాలు వస్తున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం – 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

source