స్పోర్ట్స్ (Sports)

IND vs ENG రెండో టెస్టు: భారత్ రెండో ఇన్నింగ్స్ 54/1.. ఇంగ్లండ్ 134 ఆలౌట్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ భారత స్పిన్నర్ల ధాటికి వెంట వెంటనే వెనుతిరిగారు. 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది.

మొత్తం 249 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

ఓపెనర్ రోహిత్ శర్మ 29 పరుగులతోను, చటేశ్వర్ పుజారా 7 పరుగులతోనూ నాటౌట్‌గా నిలిచారు.

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 14 పరుగులకు ఔటయ్యాడు.

ఇంగ్లండ్ 134 ఆలౌట్

59.5 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టుకు 195 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇంగ్లండ్ జట్టులో నాటౌట్‌గా నిలిచిన బెన్ ఫోక్స్ చేసిన 42 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

భారత బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు, పేసర్లు ఇషాంత్ శర్మ రెండు వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు.

131 పరుగుల వద్ద జాక్ లీక్‌ను ఇషాంత్ శర్మ ఔట్ చేయగా.. స్టువర్ట్ బ్రాడ్ అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

అంతకు ముందు.. 58లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. 

105 పరుగుల వద్ద మొయిన్ అలీ (6 పరుగులు)ని అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. మరో పరుగు తర్వాత ఒల్లీ స్టోన్ (1 పరుగు)ను అశ్విన్ ఔట్ చేశాడు.

లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 39 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ తరువాత 52 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. ఓలీ పోప్ కూడా 22 పరుగుల వద్ద ఔటవడంతో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోరీ బర్న్స్ మూడో బంతికే పెవిలియన్ బాట పట్టాడు. ఇషాంత్ శర్మ చేతిలో ఔటయిన రోరీ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ తరువాత డామినిక్ సిబ్లే 16 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచి ఇచ్చి వెనుతిరిగాడు. 

దీనికి ముందు మ్యాచ్‌లో బాగా ఆడిన కెప్టెన్ జో రూట్ కూడా ఈసారి ఆరు పరుగులకే ఔటైపోయాడు. ఆ తరువాత అశ్విన్ బౌలింగ్‌లోనే డాన్ లారెన్స్ కూడా 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. లంచ్ తరువాత బెన్ స్టోక్స్ కూడా 19 పరుగులకే అశ్విన్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 329

రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత జట్టు ఎనిమిది ఓవర్లు ఆడి 329 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు 6 వికెట్లకు 300 పరుగులు చేసిన భారత జట్టు మరో 29 పరుగులు మాత్రమే జోడించగలిగింది. రిషభ్ పంత్ 58 పరుగులు, అక్షర్ పటేల్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. రెండో రోజు అక్షర్ పటేల్ కొత్తగా పరుగులేమీ చేయకుండానే మోయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్లో ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ 96వ ఓవర్లో కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్ 4 పరుగులు చేయగా, యాదవ్ డకౌట్ అయ్యాడు.

అంతకుముందు, ఆట తొలిరోజున టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో రోహిత్ శర్మ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో మరో శతకాన్ని జోడించుకుని 161 పరుగులు చేశాడు. రహానే కూడా ధీటుగా ఆడి 67 పరుగులు చేశారు.

కాగా, ఫీల్డింగ్ జట్టు ఒక్క ఎక్‌స్ట్రా రన్ కూడా ఇవ్వకుండా 329 పరుగుల అత్యధిక టెస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ రికార్డ్ చేయడం ఈ మ్యాచ్ ప్రత్యేకతంగా నిలిచింది. అంతకుమందు, 1955లో లాహోర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చేస్తూ 328 పరుగుల వరకు ఒక్క ఎక్‌స్ట్రా రన్ ఇవ్వలేదు. ఆ రికార్డును ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ బ్రేక్ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.