కొడాలి నాని స్వ‌గ్రామం య‌ల‌మ‌ర్రు గ్రామంలో వైసీపీ ఓడి టీడీపీ గెలిచింద‌నే ప్ర‌చారంపై కొడాలి నాని స్పందించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు రెండో విడత పంచాయతీ ఎన్నికలలో త‌న‌కు సంబంధం లేని నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓడిపోతే అడ్డమైన రాతలు రాస్తున్నారని అన్నారు. పామర్రు నియోజకవర్గంలో ఉన్న యలమర్రులో వైకాపా ఓడిపోతే అది త‌న‌కు ఎదురుదెబ్బ అని సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

యలమర్రు గ్రామంలో త‌మ‌ పూర్వీకులు ఉండేవార‌ని, త‌న తండ్రి, తాను గుడివాడ‌లోనే పుట్టామ‌ని, కాబ‌ట్టి త‌న‌ సోంత ఊరు గుడివాడేన‌ని అన్నారు. యలమర్రు గ్రామంలో ఎవరు తెలుగుదేశం, ఎవరు వైసీపీ నాయ‌కులో కూడా త‌న‌కు తెలియ‌ద‌న్నారు. రామోజీ రావుకు, రాధాకృష్ణకు దమ్ముంటే త‌న‌తో యలమర్రు గ్రామానికి రావాల‌ని, తాను గ్రామంలో ఎవరినైనా ఓటు అడిగానని నిరూపిస్తే రాజకీయాలను, రాష్ట్రాన్ని వదిలి వెళ‌తాన‌ని స‌వాల్ చేశారు.

త‌న గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలకు 43 పంచాయతీలు వైసీపీనే కైవసం చేసుకుంద‌ని, ఇది రామోజీరావు, రాధాకృష్ణ‌కు క‌నిపించ‌లేదా అని ప్ర‌శ్నించారు. అన్ని మేజర్ పంచాయతీల‌ను భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంద‌న్నారు. గుడివాడ‌లో ఆయ‌న ఎన్నిక‌ల్లో గెలిచిన స‌ర్పంచ్ అభ్య‌ర్థుల‌ను స‌న్మానించారు.