చైనా కు చెక్ పెట్టె ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన క్వాడ్ తమ తొలి భేటీ ని శుక్రవారం నిర్వహించారు. సానిలో చైనా నుండి ఎదురవుతున్న సవాళ్లపై దీర్ఘంగా చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ తెలిపారు. చైనా ఎప్పటికైనా ఘర్షణాత్మక వైఖరిని వీడుతుందన్న భ్రమలు తామెవరికీ లేవని నాలుగు దేశాల నేతలు స్పష్టం చేశారన్నారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, మూడు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ(భారత్‌), స్కాట్‌ మోరిసన్‌ (ఆస్ట్రేలియా), యోషిహిదే సుగా (జపాన్‌) పాల్గొన్నారు. దాని వివరాలను వైట్ హౌస్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో జేక్‌ సలివన్‌ వెల్లడించారు. క్వాడ్‌ సమావేశం సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే జరగాలని, తృతీయ పక్ష దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం మాత్రం కాకూడదని చైనా అభ్యంతరాలను తోసిపుచ్చేలా జేక్‌ సలివన్‌ ప్రకటన ఉండడం ఇక్కడ గమనించవలసిన విషయం.

ప్రపంచ దేశాలను వెంటాడుతున్న కరోనా వైరస్‌ను తుదముట్టించేందుకు క్వాడ్‌ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని, దీని ప్రకారం భారత్‌లో వచ్చే ఏడాది చివరికి 100కోట్ల డోసుల టీకా తయారీకి అవసరమైన సాంకేతికతను అమెరికా అందిస్తుంది. దాంతోపాటు అమెరికా, జపాన్‌లు ఆర్థిక సాయం చేస్తాయి. టీకాల సరఫరా, రవాణా బాధ్యతను ఆస్ట్రేలియా చేపడుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వివరించారు. చైనా టీకా దౌత్యాన్ని అడ్డుకోవడం దీని ప్రధాన లక్ష్యం.

వేగంగా పెరుగుతున్న 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ, సైబర్‌ స్పేస్‌లలో ప్రమాణాల నిర్ధరణకు కార్యాచరణ బృందాల(వర్కింగ్‌ గ్రూప్స్‌)ను ఏర్పాటు చేసారని, ఆయా అంశాల్లో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన చేయూతను క్వాడ్‌ దేశాలకు అందించడమే కార్యాచరణ బృందాల బాధ్యత. ఈ ఏడాది చివరిలో నాలుగు దేశాల నేతల ముఖాముఖీ సమావేశం జరిగే నాటికి నిర్దిష్టమైన ఫలితాలను ఈ బృందాలు అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి సైబర్‌ దాడులపై కూడా నేతలు చర్చించారు అన్నారు.

భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, హాంకాంగ్‌, జిన్‌జియాంగ్‌, తైవాన్‌ జలసంధి అంశాల్లో చైనా వైఖరి, ఆస్ట్రేలియా, జపాన్‌లతో డ్రాగన్‌ వివాదాలతో పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, దక్షిణ, తూరు చైనా సముద్రాలలో ఘర్షణల నివారణ, ఉత్తరకొరియా అణ్వాయుధాలు, మయన్మార్‌లో అణచివేత అంశాలను క్వాడ్‌ నేతలు చర్చించారని జేక్‌ వెల్లడించారు. దీనికి అనుగుణంగానే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లతో పాటు పర్యావరణ మార్పులు, కరోనా వైరస్‌ తదితర ముప్పులను ఉమ్మడిగా ఎదుర్కొందామని నేతలు సంయుక్త ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్వాడ్‌ కూటమి నేతల తొలి భేటీని అమెరికా దౌత్యవేత్తలు సాధించిన పెద్ద విజయంగా ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ అభివర్ణించారు. మరోవైపున విపక్ష రిపబ్లికన్‌ పార్టీ నేతలు కూడా తాజా చర్చని స్వాగతించారు. భారత్‌, అమెరికాల మధ్య రక్షణ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ వచ్చే వారం దిల్లీకి రానున్నారనే విషయాన్ని పెంటగాన్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.