ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికలలో 75 మునిసిపల్ స్థానాలకు గానూ ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 73 చోట్ల విజయం సాధించగా టీడీపీకి కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రమే ఆధిక్యం దక్కించుకుంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి స్వల్ప ఆధిక్యం సాధించిన నేపథ్యంలో చైర్‌పర్సన్ సీటు నిలబెట్టుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

చిలకలూరిపేట మునిసిపాలిటీ కౌంటింగ్ పూర్తయినప్పటికీ ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక పన్నెండు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా ఏలూరులో కౌంటింగ్ ఇంకా జరగలేదు. ఓటర్ల జాబితా విషయంపై అభ్యంతరాలు రావడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు కౌంటింగ్ నిలిచిపోయింది.

మిగిలిన 11 మునిసిపల్ కార్పొరేషన్లలో కీలకమైన జీవీఎంసీ సహా అన్నింటా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. విజయనగరం, గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి మేయర్ పీఠాలు అధికార పార్టీకే దక్కాయి. జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల పరిధిలో జనసేన-బీజేపీల కూటమి కొన్ని డివిజన్లను గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోగా సీపీఎం, సీపీఐ అభ్యర్థులు జీవీఎంసీలో చెరో డివిజన్ లో విజయం సాధించారు.

ఇంకా 8 కార్పొరేషన్లలో కూడా వైసీపీకి మెజారిటీ డివిజన్లు దక్కాయి. కీలకమైన గ్రేటర్ విశాఖ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన స్థానాల్లో అధిక డివిజన్లు వైసీపీ గెలుచుకోగా, టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.